Apr 17,2023 21:46

మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబులు

ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌     ఆంధ్రప్రదేశ్‌ ప్రైమరీ అగ్రికల్చర్‌ కో-ఆపరేటీవ్‌ సొసైటీలలో 50 శాతం వాటాలను ప్రయివేటు వ్యక్తులకు, కంపెనీలకు ఇస్తూ, రైతు భరోసా కేంద్రాలను విలీనం చేస్తూ 1964 చట్టానికి చేసిన సవరణలు రద్దుచేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం ఏపీ ప్రైమరీ అగ్రికల్చర్‌ కో-ఆపరేటీవ్‌ సొసైటీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఆంజనేయులు, జిల్లా కన్వీనర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జె.హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు సిఐటియు రాష్ట్ర ఉపాద్యక్షులు ఓబులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికే పూనుకున్నాయని తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం జాతీయ సంస్థలన్నింటిని ప్రయివేటీకరణ చేసి ఉద్యోగులను అభధ్రతా భావంలోకి నెట్టి వేస్తోందన్నారు. ఉద్యోగులను పొమ్మన లేక పొగ పెట్టిన చందాన నష్టాలు వచ్చాయనో, ఇతరత్రా కారణాలతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్‌ కంపెనీలకు దేశ సంపదను దోచిపెడుతూ దేశానికి నష్టం కలిగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను తక్కువేమీ కాదన్నట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పిందల్లా ఊకొడుతూ అన్ని చట్టాలకు మద్దతు పలుతుండటం అన్యాయంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి గ్రామ రైతులకు, ప్రజలకు ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్న ప్రైమరీ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలను నిర్వీర్యం చేసే దిశాగా ప్రభుత్వం పూనుకోవడం ప్రమాదకరం అన్నారు. ఈ సొసైటీలను రక్షించుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. అందుకు సిఐటియు పోరాటాలు చేయనుందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్‌, వేతన సదుపాయలు ఇవ్వకుండా జాప్యం చేయడం ప్రభుత్వానికి సరికాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రైతు ప్రభుత్వమని చెబుతుంటారని, రైతులకు ఏళ్ల తరబడి సేవలు చేస్తున్న సొసైటీ ఉద్యోగుల భధ్రత పట్టదా అంటూ ప్రశ్నించారు. తక్షణమే ఉద్యోగులకు 36 జిఒ 90 ప్రకారం వేతనాలు, ఇతర సదుపాయాలు అమలు చేయాలన్నారు. మరో అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర నాయకులు ఎజి.రాజమోహన్‌ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాలతో ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలు ప్రభుత్వ సంస్థలకు ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వాల వైఖరి మారాలంటే ఐక్య పోరాటాలు చేయడమే సరైన మార్గం అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో 7500 మంది ఉద్యోగులు ధీర్ఘకాలంగా సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం చలనం లేకుండా ఉంటడం సరికాదన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఉద్యోగుల సమస్యలు అపరిస్కృతంగా నిలవడం బాధాకరం అన్నారు. ఎపి రైతు సంఘం నాయకులు ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. కో ఆపరేటీవ్‌ సొసైటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, హరికృష్ణ, కన్వీనర్‌ ప్రతాప్‌రెడ్డిలు మాట్లాడుతూ ఏప్రిల్‌ 1, 2029 నాటి వేతన సవరణ వెంటనే చేపట్టాలన్నారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు తొలగించాలన్నారు. 36 జిఒ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 62 సంవత్సరాల పదివి విరమణ వయసును పెంపుదల చేయాలన్నారు. పిఎసిఎస్‌లకు ఇన్‌కమ్‌ ట్యాంక్‌ పూర్తిగా మినహాయింపు ఇవ్వాలన్నారు. టీడీఎస్‌లో ఉన్న ఇబ్బందులు తొలగించాలన్నారు. ఇప్పటికే బ్యాంకులు పనులు చేసిన టిడిఎఫ్‌ మొత్తాలను తిరిగి సంఘాలకు జమ చేయాలన్నారు. సంఘాల షేర్‌ ధనం పై 6 శాతం డివిడెంట్‌, వడ్డీ తక్షణమే చెల్లించాలన్నారు. 2011-2013 మధ్య కాలంలో రైతులకు ఇచ్చిన వడ్డీ రాయితీ ఇప్పుడు సహకార సంఘాల పేర కొన్ని జిల్లా కేంద్ర బ్యాంకులు అప్పుగా రాయడం చట్ట బద్ధత కాదన్నారు. ఈ ప్రక్రియను బ్యాంకులు వెంటనే ఉప సంహకరించుకుని రివర్స్‌ ఎంట్రీలు పాస్‌ చేయాలని కోరారు. అనంతరం స్పందనలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వీరి ధర్నాకు మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, జిల్లా అధ్యక్షులు ఎటిఎం.నాగరాజు, బండారు ఎర్రిస్వామి, సిఐటియు నగర జిల్లా నాయకులు వెంకటనారాయణ హాజరై మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ అగ్రికల్చర్‌ కో ఆపరేటీవ్‌ సొసైటీస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి దామోదర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రీనివాసులు, జాయింట్‌ సెక్రటరీ రమణారెడ్డి, డివిజనల్‌ సెక్రటరీ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.