
* పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
* యుటిఎఫ్ డిమాండ్
ప్రజాశక్తి - శ్రీకాకుళం: పాత పెన్షన్ సాధనకు యుటిఎఫ్ ఆధ్వర్యాన ఈనెల 19వ తేదీ నుంచి శ్రీకాకుళం నగరంలో నిరవధిక దీక్షలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అప్పారావు, ఎస్.కిషోర్ కుమార్ తెలిపారు. నగరంలోని యుటిఎఫ్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో వారు మాట్లాడారు. జిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, డిఎస్‌సి-2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ దీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని నిరవధిక దీక్షలను జయప్రదం చేయాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సిపిఎస్ విధానాన్ని నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల వెన్నువిరిచారని తెలిపారు. ఆ విధానం రద్దు కోసం నాటి నుంచి నేటివరకు అలుపెరుగని పోరాటాలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని హామీనిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. సిపిఎస్ కన్నా ఘోరమైన జిపిఎస్ అనే మరో పెను అభద్రతా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసగించారన్నారు. తండ్రి చేసిన తప్పును కుమారుడు సరిచేస్తారని కోటి ఆశలతో అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ఉద్యోగ, ఉపాధ్యాయులను జగన్ వంచించడం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రాణాలైనా అర్పిస్తాం.. పాత పెన్షన్ సాధిస్తాం అనే నినాదంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల వృద్ధాప్య జీవిత భరోసా కోసం యుటిఎఫ్ రాజీ లేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నిరాహార దీక్షలను విజయవంతం చేయడానికి జిల్లాలోని సిపిఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు ప్రతిఒక్కరూ మద్దతుగా నిలబడి పాత పెన్షన్ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ఎల్.బాబూరావు, కోశాధికారి బి.శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.