
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఈనెల 16 నుంచి నవంబరు పదో తేదీ వరకు జిల్లాకు కేటాయించిన ఎన్నికల సామగ్రిని పరిశీలించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల వినతులు, ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని డిఆర్‌ఒ ఛాంబరులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. పలు రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఎన్నికల సామగ్రి మొదటి దశ పరిశీలన, ఇంటింటి ఓటర్ల సర్వే తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంటింటి సర్వేని క్రాస్ వెరిఫికేషన్ చేయాలన్నారు. ఎన్నికల కోసం జిల్లాకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్స్ వచ్చాయని తెలిపారు. ఇవిఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్‌ఎల్‌సి) ఈనెల 16 నుంచి చేపట్టనున్నామని చెప్పారు. ఇందుకు గాను ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు లేఖ ద్వారా ధ్రువీకరించిన వారిని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రౌతు శంకరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పి.ఎం.జె బాబు, బిజెపి నాయకులు ఇప్పిలి సీతారాజు, బిఎస్‌పి నాయకులు ఎల్.సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.