Sep 09,2023 22:34

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల నమోదు ప్రక్రియను ఈనెల 12వ తేదీ నాటికి అన్నిరకాల ఫారాలను ముగించి, 15 నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియ-24పై ఇఆర్‌ఒలు, తహశీల్దార్లు, ఇడిటిలు, బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లతో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లు ఇంటి నంబర్ల మార్పులు, పది మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్న గృహాలు, వందేళ్లు నిండిన ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఈ మూడు వివరాలు జూన్‌ నాటికే సమాచారం అందుబాటులోకి వచ్చిందన్నారు. అయినా ఇప్పటివరకు పెండింగ్‌ ఉందని, దీనిపై అధికారులు సమీక్షించుకోవాలని చెప్పారు. ఈనెల 15వ తేదీ నాటికి అన్ని పూర్తి కావాలని ఆదేశించామని, పలు సమావేశాలు నిర్వహించామని తెలిపారు. గడువుకు అతి తక్కువ సమయం ఉన్నందున శని, ఆదివారాలు సెలవు రోజులైనా విధులకు హాజరై పూర్తి చేయాలని ఆదేశించారు. మూడు నెలల కిందటే ఫారం-8 తీసుకున్నా, వాటిని అప్‌డేట్‌ చేయకపోవడానికి గల కారణాలు వివరించాలని కోరారు. ఇప్పటివరకు ఫారం-6 దరఖాస్తులు 26 వేలు, ఫారం-7 దరఖాస్తులు 11,500, ఫారం-8 దరఖాస్తులు 32,500 మొత్తం 70 వేలు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. జిల్లాలో 2,342 మంది బిఎల్‌ఒలు ఉన్నారని, సగటున 35 ఫారాల వరకు వస్తాయన్నారు. ఇంటింటి సర్వే పూర్తయి 17 రోజులైనా ఒక్కో బిఎల్‌ఒ 35 ఫారాలు కూడా పూర్తిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. డ్రాఫ్ట్‌ రోల్‌ ఈనెల 17వ తేదీ నాటికి వచ్చే అవకాశం ఉందని, నిర్లక్ష్య ధోరణి వల్ల వాటిపై ప్రభావం చూపుతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని సకాలంలో జరగాలని, ఇందుకు పెండింగ్‌లో ఉన్న అన్ని ఫారాలు పూర్తి కావాలన్నారు. శ్రీకాకుళం, పాతపట్నం, సంతబొమ్మాళి తహశీల్దార్లు, ఇడిటిలు వీటిపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ, ఇఆర్‌ఒలు, తహశీల్దార్లు, ఇడిటిలు, బిఎల్‌ఒలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.