కుంభకోణాలు, అవినీతికి మారుపేరు బిజెపి
సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
కేంద్రానికి వైసిపి ఊడిగం
సిపిఐ జిల్లా కార్యదర్శి కె.భీమారావు
ప్రజాశక్తి - భీమవరం
కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాల ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం పడుతోందని, ఈ విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయ ప్రచార ఉద్యమ భేరి నిర్వహించనున్నట్లు సిపిఎం, సిపిఐ నేతలు వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు 15 రోజులపాటు జిల్లాలో నిర్వహించబోయే ఈ ప్రచార ఉద్యమ భేరిని అంబేద్కర్ జయంతి రోజున పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రారంభిస్తామని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీల శ్రేణులతోపాటు అభిమానులు, సానుభూతిపరులు, అన్ని తరగతుల ప్రజలు ఉద్యమ భేరిలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అత్యంత దుర్మారంగా అవలంబిస్తోందన్నారు. ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్పొరేట్లకు అనుకూల విధానాలు అవలంభిస్తూ ప్రజాసంపదను వారికి కట్టబెడుతున్నారన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కార్పొరేట్లకు లక్షల కోట్లు రాయితీలు, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారాలు మోపారని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి చెందిన పద్దులన్నింటికీ కోతలు విధించారన్నారు. రైతులకు రాయితీల కుదింపు, వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పనుల్లో కోతలు, ప్రజాపంపిణీ వ్యవస్థకు కోతలతోపాటు ఎరువులు, ఔషధాల ధరలు పెంచేశారన్నారు. విచిత్రంగా విమాన ఇంధన ధరలను తగ్గించి, పేదలు, మధ్యతరగతి ప్రజలు నిత్యం ఉపయోగించే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మాత్రం విపరీతంగా పెంచారని విమర్శించారు. కుంభకోణాలకు నిలయంగా అవినీతిలో అగ్రస్థానంలో కేంద్ర ప్రభుత్వం నిలిచిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తోందని విమర్శించారు. నౌకాశ్రయాలను, విమానాశ్రయాలను, రోడ్లను, బ్యాంకులను, ఎల్‌ఐసి, రైల్వేలను కొల్లగొట్టుకునేలా కార్పొరేట్లకు అప్పగించేస్తోందన్నారు. నిరంకుశంగా ప్రతిపక్షాలపై, ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు, నిర్వాసితుల సమస్యలు, రాజధాని నిర్మాణానికి నిధులు, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల ఊసే లేదన్నారు. నిత్యావసరాల ధరలను అరికట్టడం లేదన్నారు. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మతోన్మాదాన్ని ప్రజల మీదకు ప్రయోగిస్తుందన్నారు. మైనార్టీలు, దళితులు, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా వైసిపి ప్రభుత్వం కనీసం నోరు మెదపడం లేదన్నారు. పైగా కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేసే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసిందన్నారు. చివరకు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గా కాకుండా అదాని, అంబానీప్రదేశ్‌గా మారిపోయే స్థితిలో ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షం టిడిపి, ప్రశ్నిస్తానని వచ్చిన జనసేనగాని కేంద్ర ప్రభుత్వ ద్రోహంపై మాట్లాడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్రం విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలనూ కలుపుకుని పోరాడాలన్నారు. ఈ నెల 14 నుంచి నిర్వహించబోయే యాత్రల్లో ప్రజా సమస్యలను సభలు, సమావేశాలు పెట్టి వివరిస్తామన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కును సైతం కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. నాడు నిత్యావసరాల ధరలు, గ్యాస్ ధరలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి వాటి మాటే మర్చిపోయారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిజెపికి ఊడిగం చేయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజావసరాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు చెల్లబోయిన రంగారావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కేతా గోపాలన్, బి.వాసుదేవరావు, కవురు పెద్దిరాజు పాల్గొన్నారు.










