అనంతపురం కలెక్టరేట్ : ఈ నెల 12, 13, 14వ తేదీల్లో అనంతపురంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తెలిపారు. సోమవారం నాడు గణానాయక్ భవన్‌లో జరిగిన పార్టీ నగర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏకపక్షంగా అమలవుతున్న బిజెపి విధానాలకు ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజల ముందుంచేలా సిపిఎం రాష్ట్ర సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలిపారు. 13వ తేదీ జరిగే బహిరంగసభ జయప్రదం కోసం మంగళవారం నాడు జిల్లావ్యాప్తంగా స్కూటర్ యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివద్ధికి నిధులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. ప్రజలపై భారాలు వేసే విద్యుత్ సంస్కరణలను దేశంలో అందరికంటే ముందుగా రాష్ట్రంలో అమలు చేయడం చూస్తే బిజెపికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా సాగిలా పడుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అరకొర నిధులు, తుంగభద్ర డ్యాం నీటికి ప్రమాదంగా కర్నాటకలో నిర్మిస్తున్నా ప్రాజెక్టులు, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ, కడప ఉక్కు పరిశ్రమ స్థాపనలో నిర్లక్ష్యం లాంటి అంశాలపై కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం రైతులు నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నామమాత్ర పరిహారం విడుదల చేసిందన్నారు. ఉపాధి హామీ పథకానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు నిధుల కోత, పోలవరం నిర్వాసితుల సమస్య, దళితులు, మహిళలపై కొనసాగుతున్న దాడులపై సిపిఎం రాస్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించనున్నామన్నారు.
12న చర్చావేదిక.. 13న బహిరంగ సభ
మూడు రోజుల సమావేశాలు తపోవనం సర్కిల్‌లోని జిపిఆర్ ఫంక్షన్ హాల్‌లో జరుగుతాయన్నారు. 12వ తేదీ రాష్ట్ర కార్యదర్శివర్గం, 13, 14న రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. 12వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు జెడ్పీ హాల్లో 'వెనుకబడిన ప్రాంతాల అభివద్ధి- కేరళ ప్రభుత్వ నమూనా' అనే అంశంపై కేరళ మాజీ మంత్రి ఎంఏ.బేబితో చర్చావేదిక ఉంటుందన్నారు. 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ వద్ద బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, ఎంఎ.బేబి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, మాజీ ఎంఎల్‌ఎ ఎంఎ.గఫూర్ ఉపన్యసిస్తారని తెలిపారు.










