Jul 09,2022 23:50

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గంగరాజు

సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌

సిపిఎం చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గతనెల రోజులుగా జిల్లాలో జనం కోసం సిపిఎం ఇంటింటికీ సిపిఎం పేరుతో సర్వే చేయడం జరిగిందని, సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం 11న కలెక్టర్‌తో రాయబారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని శనివారం చిత్తూరులో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరాయబారానికి జిల్లాలోని అన్ని రకాల సమస్యలపై ప్రజలు అర్జీలతో అత్యధికంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిపిఎం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి సర్వే చేసినప్పుడు అనేక రకాల సమస్యలు ప్రజలు సిపిఎం బందం దష్టికి తీసుకొచ్చారని, వాటిలో స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం కోసం సచివాలయాల వద్ద, మండల రెవెన్యూ కార్యాలయం వద్ద అర్జీలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినా ఇంకా అనేక రకాల సమస్యలు జిల్లా స్థాయిలో పరిష్కారం చేయాల్సి ఉందని ఆ సమస్యలు పరిష్కారం కోసం రాయబారం కార్యక్రమం చేపట్టమన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రధాన సమస్యలు చిత్తూరు, పలమనేరు, నగిరి, పుంగనూరు మున్సిపాలిటీలలో పేదల వున్న కాలనీలో మాలిక వసతులు ఏర్పాటు చేయాలని, చిత్తూరు నగరంలో లెనిన్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ సమస్య, చిత్తూరు, పుంగనూరు మున్సిపాలిటీలో పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్ళును వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే పలమనేరులో దళితుల భూములను జగనన్న కాలనీలకు ఇస్తున్న సందర్భంలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని, పేదలకు పట్టాలు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, వాటి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, నగరి ప్రాంతంలో ఉన్న వేలాది మంది పవర్లూమ్‌ కార్మికులకు కూలి రేట్లు పెంచి, విద్యుత్తు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీలకు చట్టప్రకారం ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించాలని, చెరుకు రైతులకు బకాయిలు ఉన్న బిల్లులు వెంటనే ఇవ్వాలని, జిల్లాలో ఉన్న 31 మండలాల్లో అర్హులైన వారికి రేషన్‌కార్డులో చేర్పులు మార్పులు చేయాలని, ఎస్సీ,ఎస్టీ పేదల ఎక్కడ ఉన్నా విద్యుత్‌ ఉచితంగా ఇవ్వాలని, వారి ఆధీనంలో ఉన్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులు పంట బీమా అందరికీ అందలేదన్నారు. జిల్లాలో కలెక్టర్‌ విడుదల చేసిన సర్య్కులర్‌ ప్రకారం కార్మికులకు వేతనాలు ఎక్కడ ఇవ్వడం లేదని వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇవే కాకుండా ప్రజలు ఇంకా అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని వాటి పరిష్కారం కోసం ఈ రాయబార కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.సురేంద్రన్‌, సీనియర్‌ నాయకులు చల్లా వెంకటయ్య, బాలసుబ్రమణ్యం, దాము పాల్గొన్నారు.