Oct 29,2023 21:47

మాట్లాడుతున్న ప్రభాకరరావు

* తక్షణమే రద్దు చేయాలి : ఎస్‌టియు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జిఒతో విద్యారంగం నాశనమవుతుందని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పేడాడ ప్రభాకరరావు అన్నారు. తక్షణమే ఈ జిఒను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నగరంలోని క్రాంతిభవన్‌లో సంఘ జిల్లా అధ్యక్షులు పడాల తమ్మినాయుడు అధ్యక్షతన కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 117 జిఒతో ఉపాధ్యాయులను తగ్గించి, పాఠశాలలను క్రమంగా మూసివేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. దుర్మార్గమైన ఈ ఉత్తర్వుల వల్ల నాడు-నేడులో రూ.లక్షలు ఖర్చు పెట్టిన పాఠశాలలూ మూతపడనున్నాయని చెప్పారు. తమ్మినాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని హామీనిచ్చారని, అధికారంలోకొచ్చాక అంతకంటే దుర్మార్గమైన జిపిఎస్‌ విధానాన్ని తీసుకొస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే జిపిఎస్‌ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. జిపిఎస్‌ను తీసుకురావడం వెను ప్రభుత్వ వాటా అయిన 14 శాతాన్ని ఎగ్గొట్టే దురుద్దేశం దాగి ఉందన్నారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి రమణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగులు దాచుకున్న డబ్బును వారి అవసరాలకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. మరోవైపు జీతం ఎప్పుడు ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధ్యాయ వ్యవస్థలో ఎంటిఎస్‌ విధానాన్ని రద్దు చేసి 1998, 2008 డిఎస్‌సి అభ్యర్థులను బేషరతుగా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షులు సన్యాసిరావు, జి.రమణ, ఇందిర, ఎం.తేజేశ్వరరావు, గోవిందరావు, బొడ్డేపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు.