Jul 13,2023 08:58

లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి

         తాడిపత్రి : నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగేళ్లలో వివిధ సమస్యలతో ఇబ్బందులు పడిన 1100 మందిని సిఎం సహాయ నిధి ద్వారా ఆదుకున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి లబ్ధిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు 30 ఏళ్లుగా తాడిపత్రిలో సిఎం సహాయ నిధిని వారి ముఖ్య అనుచరులకు మాత్రమే వర్తింపజేసుకొన్నారని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో తాము 1100 మందికి సిఎం సహాయ నిధి అందించామన్నారు. ప్రజలకు అవసరమైన పథకాలు, సర్టిఫికెట్లకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే గుర్తించడానికి ప్రభుత్వం ప్రతి ఇంటికీ వెళ్లి సమగ్ర సర్వే నిర్వహిస్తోందన్నారు. సమస్యలను వంద శాతం పరిష్కరించేందుకు ప్రతి సచివాలయంలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు, సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో జగన్‌ సారథ్యంలోని వైసిపి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవి, తహశీల్దార్‌ మునివేలు, నాయకులు ఫయాజ్‌బాషా, ఓబులేష్‌రెడ్డి, నరసింహారెడ్డి, మధు, తదితరు లు పాల్గొన్నారు.