ప్రజాశక్తి-తిరుపతి సిటి
ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షలపై గురువారం జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్‌వో ఎన్.రాజశేఖర్ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 31వ తేది వరకు 92 కేంద్రాల్లో జబ్లింగ్ విధానంలో ప్రాక్టీకల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ పరక్షలు జరుగుతాయని, పరీక్షల సమయంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా జనరల్ విభాగంలో 27,480, ఓకేషనల్‌లో 8074 మంది, మొత్తం 35,554 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను అందరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, హైపవర్ కమిటీ సభ్యులు డి.గోపాల్‌రెడ్డి, డిఈసి సభ్యులు వేణుగోపాలరెడ్డి, శ్రీధర్, బాబు తదితరులు పాల్గొన్నారు.










