Nov 13,2022 22:42

వైద్య సేవల కోసం వేచి ఉన్న వివిధ గ్రామాల ప్రజలు

104 సేవలు అంతంతమాత్రం..!
వైద్యంకోసం నిరీక్షిస్తున్న గ్రామీణ ప్రజలు
సమయపాలన పాటించని వైద్యసిబ్బంది

ప్రజాశక్తి-యాదమరి :
గ్రామీణ ప్రాంతాల్లో 104 వైద్యసేవలు అంతంతమాత్రంగా నిర్వహిస్తున్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన 104 వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సక్రమంగా అందించడం లేదని.. అసౌకర్యంగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలు ఏర్పాటు చేస్తున్నారని యాదమరి మండలంలోని పెరియంబాడి, కోనపల్లి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామ పంచాయతీల ప్రజలకు నెలకొకసారి 104 వాహనంలో వైద్య సౌకర్యం అందించాల్సి ఉండటంతో అందరికీ సౌకర్యవంతమైన ప్రాంతంలో సేవలు అందించాలని పెరియంబాడి, కోనపల్లి గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు. 30 కుటుంబాలు ఉన్న కమ్మారాయనిమిట్ట గ్రామంలో వైద్య సేవలు ఏర్పాటు చేయడంతో 200 కుటుంబాలు ఉన్న గ్రామాల పరిధిలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఆ గ్రామాల్లోని ప్రజలు రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శిబిరానికి వర్షంలో తడుచుకుంటూ వైద్యం కోసం వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ లను ఏర్పాటు చేస్తోంది. ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ కింద ప్రతి గ్రామ సచివాలయాల పరిధిలో హెల్త్‌ క్లినిక్‌ సేవలు అందిస్తున్నారు. సచివాలయ పరిధిలో ప్రజల వద్దకే నెలకోసారి 104 వాహనం వైద్య సిబ్బంది, వైద్యాధికారి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ సచివాలయ పరిధిలోని ఆరోగ్య సమస్యలపై వచ్చిన ప్రజలకు వైద్యం అందించి మందులు ఇవ్వాల్సి ఉంది. అయితే శనివారం కోనాపల్లి , పెరియంబాడీ, గ్రామపంచాయతీ పరిధిలో వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మధ్యాహ్నం వరకు వాహనం వద్ద వివిధ సమస్యలతో వచ్చిన వారికి వైద్య పరీక్షలు అందించి మందులు అందించాల్సి ఉంది. అనంతరం వైద్య శిబిరం వద్దకు రాలేని బెడ్‌కు పరిమితమైన వారికి ఇంటి వద్దనే వైద్యాధికారులు, వైద్య సిబ్బంది వెళ్లి చికిత్సలు అందించాలి. సచివాలయ పరిధిలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సైతం పరిశీలించి అనారోగ్య బారిన పడిన పిల్లలకు వైద్య పరీక్షలు అందించాల్సి ఉంది. అయితే యాదమరి మండలంలో 104 వాహన సిబ్బంది, వైద్యాధికారులు కార్యక్రమంపై ప్రత్యేక దష్టి సారించడం లేదు. ప్రజల సౌకర్యార్థం చికిత్స అందించకుండా వారికి సౌకర్యంగా 104 వాహనాలను వారికి ఇష్టం వచ్చినచోట ఏర్పాటు చేసుకుంటూ, సమయపాలన పాటించకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావత్తం కాకుండా ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి గ్రామీణ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశాల్లో 104 వాహనాల ద్వారా వైద్య సదుపాయాలు కల్పించాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధికారులను కోరుతున్నారు.