Oct 26,2023 21:59

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డిఇఒ వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యాన నవంబరు పదో తేదీ నుంచి నిర్వహించే చెకుముకి సైన్స్‌ సంబరాలను విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో చెకుముకి సంబరాల పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తేదీన పాఠశాల స్థాయిలో, 30న మండల, పట్టణ స్థాయిలో డిసెంబర్‌ 17న జిల్లాస్థాయిలో చెకుముకి సైన్స్‌ సంబరాలను నిర్వహించాలన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌ మాట్లాడుతూ జిల్లాస్థాయి పోటీల అనంతరం వచ్చే ఏడాది జనవరి 27, 28 తేదీల్లో రాష్ట్రస్థాయి సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈ సంబరాల ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జెవివి జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వాగ్దేవి, జిల్లా ఆడిట్‌ కన్వీనర్‌ బి.ఉమామహేశ్వరరావు, జిల్లా పర్యావరణ కమిటీ కన్వీనర్‌ ఎ.వాసుదేవరావు, ధనలక్ష్మి, సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.