10 గ్రామాల్లో సర్వే రాళ్లు నాటే ప్రక్రియ..
దశల వారీగా రీసర్వే వేగవంతం : కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
రీసర్వే కార్యక్రమం జిల్లాలో వేగవంతంగా జరుగుతోందని ఫైనల్ ఆర్‌ఓఆర్ 124 గ్రామాలకు సంబంధించి విడుదల చేయడం జరిగిందని, ప్రస్తుతం క్లరికల్‌స్థాయిలో వెరిఫికేషన్ జరుగుతోందని కలెక్టర్ ఎం. హరినారాయణన్ అన్నారు. బుధవారం రీసర్వేకు సంబంధించి కార్యదర్శులు సిద్దార్థ జైన్, గణేష్, ఇంతియాజ్ అహ్మద్‌లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 700కు పైగా గ్రామాలలో రీసర్వేకి సంబంధించి డ్రోన్‌సర్వే పూర్తి అయిందని, అందులో 124 గ్రామాలకు సంబంధించి ఫైనల్ ఆర్‌ఓఆర్ ఇచ్చారని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కొన్నిచోట్ల తప్పులు ఏమైనా ఉంటే సవరించుకోవడం, క్లరికల్‌స్థాయిలో కార్యాలయాల్లో ప్రస్తుతం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 10గ్రామాల్లో సర్వే రాళ్లు నాటే ప్రక్రియ జరుగుతోందని ఈ కార్యక్రమం మరింత వేగవంతంగా జరిగేటట్లు చూస్తామన్నారు. రీసర్వేలో ఏమైనా దరఖాస్తులు వస్తే తగిన విధంగా క్షేత్రస్థాయిలో విచారించి చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు అన్నారు. అదేవిధంగా జిల్లాలో 22ఏకి సంబంధించి వివిధ సెక్షన్ల వారీగా ఉన్న దరఖాస్తులను వేర్వేరుగా గుర్తించి చర్యలు తీసుకొనేందుకు డిఆర్‌ఓలతో సమావేశం నిర్వహించనున్నట్లు కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. మ్యుటేషన్ దరఖాస్తులు నిబంధనల ప్రకారమే పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










