Oct 04,2023 22:26

మాట్లాడుతున్న ఎస్‌పి రాధిక

* ఎస్‌పి జి.ఆర్‌ రాధిక
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
జిల్లాలో ఈనెల 10, 11 తేదీల్లో కోస్టల్‌ సెక్యూరిటీ ఎక్సర్‌సైజ్‌ (సాగర్‌ కవచ్‌ డ్రిల్‌)ను నిర్వహించనున్నట్లు ఎస్‌పి జి.ఆర్‌ రాధిక తెలిపారు. నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గల ఎస్‌పి ఛాంబరులో మెరైన్‌ పోలీసులు, స్పెషల్‌ బ్రాంచ్‌ డిఎస్‌పి బాలరాజుతో సాగర్‌ కవచ్‌ డ్రిల్‌కు అవసరమైన పోలీసు సిబ్బంది, వస్తు సామగ్రి, బందోబస్తు ఏర్పాట్లపై బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగర్‌ కవచ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నందున ఎక్కడెక్కడ బందోబస్తు నియమించాలో ముందుస్తుగా గుర్తించి అవసరమైన సిబ్బందిని కేటాయించాలని సూచించారు. ఎంతమంది సిబ్బంది అవసరమవుతారో వివరాలను ముందస్తుగా తెలపాలని మెరైన్‌ పోలీసు అధికారులకు సూచించారు. సాగర్‌ కవచ్‌ డ్రిల్‌ ద్వారా సముద్రంలో శత్రు దళాలపై నిఘా, గుర్తింపు గస్తీ పటిష్టం చేయాలన్నారు. వస్తు సామగ్రి, బోట్లు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కోస్టల్‌ సెక్యూరిటీ సిబ్బంది, జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ సమన్వయంతో సాగర్‌ కవచ్‌ డ్రిల్‌ను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో కళింగపట్నం మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ సిఐ ఎస్‌.గోవిందరావు, బారువ మెరైన్‌ పోలీస్‌స్టేషన్‌ సిఐ జె.రమేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.