Sep 12,2023 21:13

సమావేశంలో మాట్లాడుతున్నజెడ్‌పి చైర్మన్‌ శ్రీనివాసరావు

ప్రజాశక్తి-విజయనగరం :  ఉమ్మడి జిల్లాల్లోనున్న సోషల్‌ వెల్ఫేర్‌, బిసి వెల్ఫేర్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ తదితర వసతి గృహాలలోనున్న వంట గదులు, వంట పాత్రలు విద్యార్ధుల భోజనానికి అవసరమైన సౌకర్యాలు, సామగ్రిని మార్చడానికి జిల్లా పరిషత్‌ నుంచి నిధులను సమకూర్చనున్నట్లు జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరం లో 3,5,6 స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు చైర్మన్‌ ఆధ్వర్యంలో జరిగాయి. వసతి గహాల సామాగ్రి బాగా పాడై పోయిందని, పెరిగిన విద్యార్ధుల సంఖ్యకు ప్రస్తుతం ఉన్న సామగ్రీ సరిపోవడం లేదని సోషల్‌ వెల్ఫేర్‌ డిడి చైర్మన్‌ దృష్టికి తెచ్చారు. చైర్మన్‌ స్పందిస్తూ రెండు జిల్లాల్లో నున్న అన్ని వసతి గృహాలకు, మహిళా ప్రాంగణానికి, మూగ చెవిటి పిల్లల పాఠశాలకు, అవసరమైన సామాగ్రి కోసం వెంటనే ప్రతిపాదనలు పంపాలని, జెడ్‌పి నిధుల నుండి లేదా సిఎస్‌ఆర్‌ కింద కొత్త సామాగ్రి కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లా పరిషత్‌ లో అధికారులు, జెడ్‌పిటిసిలను సభ్యులుగా పర్చేజ్‌ కమిటీ ను ఏర్పాటు చేసి ధరలను, నాణ్యతను తనిఖీ చేయాలనీ జెడ్‌పి సిఇఒకు సూచించారు.
వ్యవసాయ శాఖ చర్చ లో భాగంగా ఎరువుల లభ్యత పై వేపాడ జెడ్‌పిటిసి మాట్లాడుతూ ఆర్‌బికెలో డిఎపి లేదని తెలిపారు. చైర్మన్‌ మాట్లాడుతూ అన్ని కాంప్లెక్స్‌ ఎరువులు ఆర్‌బికె ల్లో అందుబాటులో ఉంచాలని, ధరల నియంత్రణకు టాస్క్‌ ఫోర్సు కమిటీ లను వేసి నిఘా పెట్టాలని వ్యవసాయ శాఖ జెడికి సూచించారు. ఎరువులన్ని ఆర్‌బికెలోని కియోస్కో ద్వారానే పంపిణీ చేయాలని, అప్పుడు మాత్రమె ప్రభుత్వ సబ్సిడీ వస్తుందని అన్నారు.
ఐసిడిఎస్‌పై జరిగిన చర్చలో చైర్మన్‌ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉండిపోయిన అంగన్‌వాడీ భవనాల వివరాలను అందజేస్తే వాటి నిర్మాణాలకు జిల్లా పరిషత్‌ నుండి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. త్వరగా భవనాలను పూర్తి చేసి ప్రారంభించాలని తెలిపారు.
సమావేశంలో ఎంఎల్‌సి డాక్టర్‌ సురేష్‌ బాబు, జెడ్‌పి సిఇఒ రాజ్‌ కుమార్‌ , స్థాయీ సంఘాల అధ్యక్షులు బాపు నాయుడు, శాంతికుమారి, సింహాచలం, జెడ్‌పిటిసిలు, రెండు జిల్లాల అధికారులు పాల్గొన్నారు.