ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఓవైపు వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఖరీఫ్ కాలం మూడు నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ పంటల సాగు పెరగడం లేదు. వరి, మొక్కజొన్న మొదులకుని అన్ని పంటల్లోనూ సాగు విస్తీర్ణం తక్కువగానే కనిపిస్తోంది. చివరికి సాగునీటి వనరులు ఉన్న చోట కూడా వరి సాగు లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగలేదు.
జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు జూన్ నుంచి మొదలవుతుంది. రుతుపనాలు సకాలంలో జిల్లాను తాకితే ఆగస్టు ప్రారంభం నాటికి పంటలన్నీ, ముఖ్యంగా వరి నాట్లు పూర్తయ్యేవి. మారిన వాతావరణ పరిస్థితుల వల్ల గడిచిన నాలుగైదేళ్లగా రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కనీసం ఆగస్టు చివరి దశ లేదా సెప్టెంబర్ రెండో వారం నాటికి వరినాట్లు పూర్తయ్యేవి. మిగిలిన పంటల సాగు కూడా దాదాపు పూర్తికావచ్చేది. ఈ ఏడాది సకాలంలోనే వరి నారు వేసేందుకు వర్షాలు సహకరించినప్పటికీ ఆ తరువాత మండిన ఎండులు, వర్షాభావ పరిస్థితుల వల్ల సకాలంలో ఉబాలు పట్టేందుకు అవకాశం లేకపోయింది. జిల్లాలో ప్రధాన పంట వరి. ఆ తరువాత స్థానంలో చెరకు, మొక్కజొన్న, పత్తి, చిరుధాన్యాలు ఉంటాయి. మొత్తంగా పంటలన్నీ కలుపుకుని గత ఖరీఫ్ సీజన్‌లో 3,02,602 ఎకరాల్లో సాగయ్యాయి. ఈ ఏడాది సుమారు 3,13,465 ఎకరాల్లో సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనావేశారు. కానీ, ఆచరణలో ఇప్పటి వరకు కేవలం 2,24,515 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. గత ఏడాది ఇదే తేదీ నాటికి 2,56,985 ఎకరాల్లో సాగైనట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని బట్టి గత సీజన్‌తో పోలిస్తే 78,087 ఎకరాలు, గతేడాది ఇదే సమయంతో పరిశీలిస్తే 32,470 తక్కువగా విస్తీర్ణంలో పంటల సాగు ఉన్నట్టు స్పష్టమౌతోంది.
వరి సాధారణ విస్తీర్ణం 2,25,637 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 1,78,357 ఎకరాల్లో మాత్రమే సాగైంది. గతేడాది ఇదే తేదీనాటికి 1,91,537 ఎకరాల్లోనూ, సీజన్ మొత్తానికి 2,34,107 ఎకరాల్లోనూ నాట్లు పడ్డాయి. సాగునీటి వసతి ఉన్నచోట 2,21,470 ఎకరాల్లో ఉబాలు కావాల్సివుండగా, 1.75,782 ఎకరాల్లో మాత్రమే అయ్యాయి. గత ఏడాది ఇదే తేదీనాటికి సాగునీటి వసతి ఉన్నచోట 1,88,957 ఎకరాల్లో నాట్లు పడ్డాయి.
పత్తి సాధారణ విస్తీర్ణం 8,232 ఎకరాలుకాగా, ఇప్పటి వరకు 3,322 ఎకరాల్లో సాగైంది. గత ఏడాది ఇదే సమయానికి 4,445 ఎకరాల్లోనూ, సీజన్ మొత్తంగా 5097 ఎకరాల్లో సాగైంది. చెరకు సాధారణ సాగు విస్తీర్ణం 18,897 ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 7,525 మాత్రమే సాగు కనిపిస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి 10,475 ఎకరాలు, సీజన్ మొత్తంగా 11,265 ఎకరాల్లో సాగైంది. నువ్వులు, పెసలు, మినుములు, వేరుశనగ తదితర పంటల సాగు కూడా ఈ మేరకు తగ్గింది.
స్వల్పంగా పెరిగిన వర్షపాతం
నెలవారీగా వర్షపాతంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్ మొత్తంగా పరిశీలిస్తే 18.2 మిల్లీమీటర్ల వర్షం అధికంగానే కురిసింది. కానీ, ఆ నెలవారీ హెచ్చుతగ్గులే పంటల విస్తీర్ణం తగ్గిపోవడానికి మూల కారణంగా కనిపిస్తున్నాయి. జూన్‌లో 51.9 మి.మీ వర్షం తగ్గింది. జులైలో 82.4 మి.మీ పెరిగింది. తిరిగి ఆగస్టులో 23.7 మి.మీ వర్షం తగ్గిపోయింది. సెప్టెంబర్‌లో గడిచిన 9రోజులకు 46.4 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సివుండగా 110.4 పడింది. దీంతో, సీజన్ మొత్తంగా వర్షపాతం పెరిగినప్పటికీ సాగుకు అనుకూలంగా లేకపోవడంతో విస్తీర్ణం తగ్గినట్టుగా స్పష్టమౌతోంది.
తోటపల్లి ప్రాజెక్టునుంచి నీరందించాలి
గుర్ల మండలంలో ఏకైక సాగునీటి ప్రాజెక్టు అయిన గడిగెడ్డలో పూర్తిస్థాయిలో నీటినిల్వలు లేకపోవడం తో రైతులు వరినాట్లు వేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ నుండి నీరు గడిగడ్డకు రాక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. తగినంత వర్షాలు లేక నాట్లు పడలేదు. గత నాలుగేళ్లుగా తోటపల్లి నీరు రాకపోయినా నాయకులు పట్టించుకోక పోవడం ఈ ప్రాంత రైతుల దురదృష్టం. ఇప్పటి కైనా అధికారులు ప్రజాప్రతి నిధులు కలుగ చేసుకొని గడిగెడ్డకు తోటపల్లి నీరు తెచ్చేందుకు కృషి చేయాలి.
కడగల అప్పన్న, రైతు, పల్లిగండ్రేడు, గుర్ల మండలం
నెల సాధారణవర్షపాతం కురిసింది వ్యత్యాసం
జూన్ 123.5 మి.మీ 59.4మి.మీ -51.9 మి.మీ
జులై 170.8 మి.మీ 311.5 మి.మీ 82.4మి.మీ అధికం
ఆగస్టు 189.9 మి.మీ 143.4 మి.మీ -23.7 మి.మీ
సెప్టెంబర్ 46.4 మి.మీ 110.4 మి.మీ 137.9 మి.మీ
మొత్తం 528.6 మి.మీ 624.7 మి.మీ 18.2మి.మీ అధికం










