ప్రజాశక్తి-విజయనగరం : వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా జిల్లాలో పంటల విధానాన్ని అమలు చేయాలని, పరిస్థితి చేయిదాటక ముందే ప్రత్యామ్నాయ చర్యలను తీసుకోవాలని జిల్లా పరిషత్తు చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బుధవారం జరిగింది. 2023-24 ఖరీఫ్ సీజన్‌కు పంటల విధానం, ఎరువులు, విత్తనాల సరఫరా, వర్షాభావ పరిస్థితులు, హమాలీ ఛార్జీల చెల్లింపు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ నిర్వహించారు. సమావేశంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు నివేదిక చదివి వినిపించారు. ఇప్పటి వరకు అన్ని రకాల పంటలకు సంబంధించి 60 శాతం నాట్లు పూర్తయ్యాయని, జూన్, జూలైతో పోల్చితే 9.4 శాతం వర్షపాతం అధికంగా నమోదైందని వెల్లడించారు. ఆగస్టులో కొంచెం వర్షపాతం తక్కువగా ఉందని, సెప్టెంబర్‌లో అనుకూల వర్షాలు ఉండొచ్చని ప్రస్తావించారు.
అనంతరం జెడ్‌పి చైర్మన్ మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు 1001, 1010 రకాలకు బదులుగా ఎన్‌ఎల్‌ఆర్ 34449 రకాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా అవసరాలకు సరిపడా సుమారు 10 వేల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయాలని మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. గోదాముల్లో ప్రస్తుతమున్న 1.33 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచాలన్నారు. తోటపల్లి నుంచి వారం రోజుల్లోగా విజయనగరం బ్రాంచ్ కెనాల్‌కు నీరు విడుదల చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఎలాంటి షరతులు లేకుండా కేంద్రం నిర్ణయించిన విధంగా టన్ను చెరకుకు రూ.3,150 చెల్లిస్తే లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయ పడ్డారు. సిసిఆర్‌సి కార్డులున్న కౌలురైతులకు కూడా రుణ సదుపాయం కల్పించాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులకు సూచించారు. అర్హతలు, నిబంధలను బట్టి చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గేదెల వెంకటేశ్వర రావు, డిసిఎంఎస్ చైర్‌పర్శన్ అవనాపు భావన, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.










