ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఓవైపు విద్యుత్తు కోతలు... మరోవైపు ఛార్జీల మొత వెరసి ప్రజానీకాన్ని ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏప్రిల్ 1 నుంచి వివిధ రూపాల్లో ఛార్జీలను పెంచిన ప్రభుత్వం వారం రోజులుగా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్తు కోతలు ప్రారంభించడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డబ్బుపోయే... సుఖమూ లేకపోయే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బరితెగించిందంటూ జనం అగ్గిమీద గుగ్గిలమౌతున్నారు.
విజయనగరం ఉమ్మడి జిల్లాలో 8,11,017 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహాలకు 6,71,921, వాణిజ్యం 68,939, ప్రభుత్వ కార్యాలయాలకు 15,321, వ్యవసాయ పంపుసెట్‌లకు, 52,082 ఉన్నాయి. వీటన్నింటికీ ఎపిఇపిడిసిఎల్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతోంది. వినియోగదారులంతా ఎప్పటి బిల్లులు అప్పుడే చెల్లిస్తున్నారు. ఒక వేళ గడువు తేదీలోపు చెల్లించకపోతే ఫీజులు పీకేసి మరీ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. అయినప్పటికీ లెక్కలు వేశాక వినియోగదారులు చెల్లించిన డబ్బులు విద్యుత్తు ఉత్పత్తికి, పంపిణీ తదితర ఖర్చులకు సరిపోలేదంటూ సర్ ఛార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నారు. మరే సంస్థలోనూ లేని విధంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లోనే ఇటువంటి విధానం అమలవుతుంది. ఈనేపథ్యంలో నాణ్యమైన కరెంటు నిరంతరం సరఫరా చేయాల్సిన ప్రభుత్వం వేలాపాలా లేకుండా విద్యుత్ కోతలకు పాల్పడుతోంది. పట్టణాలు, గ్రామాలు, రాత్రి పగలు అన్న తేడా లేదు. అన్ని చోట్లా సమయంతో సంబంధం లేకుండా రోజుకు 4 నుంచి 5గంటల పాటు విద్యుత్ కట్ చేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అసలే ఎండలు వేసవికాలాన్ని తలపిస్తున్నాయి. ఉక్కపోత, వేడి చాలా ఎక్కువగా ఉంది. ఈనేపథ్యంలో రాత్రివేళల్లో కట్ చేయడం వల్ల నిద్రాభంగం ఏర్పడుతోంది. ముఖ్యంగా పిల్లులు, వృద్ధులు తీవ్ర అస్థలు పడుతున్నారు. పగటిపూట విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో వ్యవసాయ పంప్ సెట్లకు నుంచి సాగునీరు అందని పరిస్థితి. అసలే వర్షాభావం వెంటాడుతోంది. ఈనేపథ్యంలో అక్కడక్కడ విద్యుత్ బోర్ల సాయంతో ఉబాలు పడుతున్నారు. విద్యుత్ అంతరాయం వల్ల నాట్లకు ఆటకం కలుగుతోంది. కార్యాలయాల్లో గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో కప్యూటర్లతో పనిచేయడం సాధ్యపడడం లేదు. ఇక పట్టణ ప్రాంతాల్లో మిగిలిన సమయాల్లో ముఖ్యంగా హోటళ్లు, ఇళ్లల్లో పిండిరుబ్బు వేసేందుకు ఆటకంగా మారింది. సమయానికి విద్యుత్ లేకపోవడంతో ఇళ్లలో నీరు లేక, సకాలంలో ఆఫీసులకు, ఇతర పని ప్రదేశాలకు బయలుదేరలేని పరిస్థితి దాపురిస్తోంది. నెట్, జిరాక్స్ వంటి దుకాణాలు, షాపులు నడుపుతున్నవారు ఉపాధి కోల్పోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది.
సర్దుబాటు ఛార్జీలు ఇలా..
విద్యుత్తు భారాలు మోపేందుకు మాత్రం ఢోకా లేదు. 2014 నుంచి 19వరకు వినియోగించుకున్న విద్యుత్‌కు చెల్లించిన బిల్లులు సరిపోలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,900 కోట్లమేర సర్థుబాటు భారం మోపింది. జనం నుంచి మూడేళ్లపాటు వసూలు చేయడానికి విద్యుత్ ఛార్జీల నియంత్రణ మండలి ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలు ఆమోదం పొందాయి. ఇప్పటికే యూనిట్‌కు 20పైసలు చొప్పున 11నెలల పాటు వినియోగదారులు చెల్లించారు. మరో 25నెలలపాటు ఇంకా చెల్లించాల్సివుంది. ఇది చాలదన్నట్టుగా 2021 -22 ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన విద్యుత్ బిల్లులకు చెల్లించిన మొత్తం సరిపోలేదంటూ మరోసారి 20పైసలు చొప్పున సర్థుబాటు ఛార్జీలు మోపుతున్నారు. పాత, కొత్త సర్థుబాటు ఛార్జీలు 40పైసలు మోయడమే వినియోగదారులకు అత్యంత కష్టతరంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ భారాన్ని తగ్గించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పడుతున్న భారాలకు ఎప్పటి వరకో ఎందుకు ఆగాలి అంటూ మరుచటి నెలలోనే సర్థుబాటు ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశించింది. మోడీ ఆదేశాలే తడువుగా జగన్ సర్కారు ఏప్రిల్ నెలలో చెల్లించిన డబ్బులు సరిపోలేదని మరో 40పైసలు వసూళ్లకు సిద్ధపడింది. ఈ లెక్కన కేవలం సర్థుబాటు ఛార్జీ రూపంలోనే 80పైసలు భారం పడుతోంది. జిల్లాలో రోజుకు సుమారు కోటి యూనిట్ల వినియోగం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వాసులపై నెలకు రూ.80లక్షల వరకు భారం పడుతోంది. ఏడాదికి రూ.24కోట్ల పైమాటే భారం. దీనికితోడు నెలవారీ వినియోగపు బిల్లు, ఫిక్స్‌డ్ ఛార్జీ, కస్టమర్ ఛార్జీ, ట్రూ అప్ ఛార్జీ తదితరాల రూపంలో అధిక మొత్తంలో బిల్లులు విధించారు. 20 నుంచి 30 యూనిట్లు వినియోగించిన సామాన్య కుటుంబాలకు వేల రూపాయల బిల్లులు వస్తున్నాయి. దీంతో, గత నెలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో బిల్లులు వచ్చాయంటూ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఛార్జీకన్నా ఇలా కొసరుగా విధిస్తున్న ఛార్జీలే అధికంగా ఉన్నాయి. దీంతో, తమకు అర్థం కాకుండా కొత్తకొత్త రూపాల్లో ఛార్జీలు పెంచి తమను మోసం చేస్తున్నారని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందుచూపు లేకే విద్యుత్తు కోతలు
బొబ్బిలి : విద్యుత్తు సరఫరాపై ప్రభుత్వానికి ముందుచూపు లేక పోవడంతోనే అప్రకటిత కోతలు విధిస్తున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్తు కోతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో విద్యుత్తు కోతలను చూస్తే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. విద్యుత్తు కోతలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. విద్యుత్తు కోతలు నివారించి నిరంతరాయంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్తు కోతలు అన్యాయం
బొబ్బిలి : వేళాపాలా లేకుండా విద్యుత్తు కోతలు విధించడం దుర్మార్గమని పిసిసి సభ్యులు మువ్వల శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యుత్తు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాత్రి సమయాల్లో విద్యుత్తు కోతలు విధించడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారని తెలిపారు.
విద్యుత్తు కోతతో ఆసుపత్రి పాలవుతున్నాం
ప్రభుత్వం విధించిన విద్యుత్ కోతలవల్ల ఆసుపత్రుల పాలవుతున్నాం. రాత్రిపూట దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వాటి బారిన పడడం వల్ల తన ఇద్దరు పిల్లలూ జ్వరం బారినపడ్డారు. ఆసుత్రులకు తీసుకెళ్తే రూ.వేలు ఖర్చు అయ్యాయి. ఫ్యాన్లు తిరిగేందుకు అవకాశం లేక ఉక్కుపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఇంతలా ఛార్జీలు మోపి, ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వానికి తగదు.
బోనుమద్ది భారతి, ఆకులకట్ట గ్రామం,
బాడంగి మండలం










