ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల పేరుతో 6వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీలు భారాలు వేశారని, తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం ఆర్‌డిఒ కార్యాలయం పక్కనగల సబ్‌స్టేషన్ వద్ద విద్యుత్తు బిల్లులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు ఫలితంగా ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పేద మధ్యతరగతి ప్రజానీకానికి ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ప్రజలు పెరిగిన ధరలతో శతమతమవుతుంటే ఇవి చాలదన్నట్లు మూలుగుతున్న నక్క పైన తాటిపండు పడినట్లు విద్యుత్ ఛార్జీలను పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కావున పెరిగినధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం సమర భేరి కార్య క్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం దిగిరాక పోతే ప్రజలే ప్రభుత్వాన్ని దించేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.రమణమ్మ, బి.రమణ, కంది త్రినాధ్, కానూరు రమణ, శేఖర్,గోపి, తది తరులు పాల్గొన్నారు.










