Sep 02,2023 18:55

విద్యుత్‌ లేక ఖాళీగా ఉన్న వెల్డింగ్‌ షాపు

ప్రజాశక్తి-బొబ్బిలి :  అటు విద్యుత్‌ ఛార్జీల వాతలు.. ఇటు విద్యుత్‌ కోతలతో ప్రజలు, వృత్తిదారులు, మెకానిక్‌లు, చిరు వ్యాపారులు, వెల్డర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి తగ్గట్టు సరఫరా లేకపోవడంతో అప్రకటిత విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధించడంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ కోతలతో దోమలు బెడద, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవ్వగా పనులు ముందుకు సాగకపోవడంతో వృత్తిదారులు, జీవనోపాధి కోల్పోతున్నారు. నెల రోజుల నుంచి విద్యుత్‌ కోతలు ఉండడంతో నష్టాల పాలవుతున్నారు.
బొబ్బిలి సబ్‌ డివిజన్‌ పరిధిలో బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం దత్తిరేజేరు, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, మెంటాడ మండలాల్లో గృహ వినియోగ విద్యుత్‌ కనెక్షన్లు లక్షా 56వేల 639, వాణిజ్య కనెక్షన్లు 12,244, పరిశ్రమల కనెక్షన్లు 611, హెచ్‌టి కనెక్షన్లు 63, వీధి దీపాలు, ఆలయాలు (కేటగిరీ-4) కనెక్షన్లు 2,792, వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు 4528 ఉన్నాయి. విద్యుత్‌ కోతలు విధించడంతో దోమల బెడదతో పాటు ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాత్రి సమయాల్లో విద్యుత్‌ కోతలతో నిద్రలు లేక గ్రామాల్లో ప్రజలు ఆరు బయట నిద్రించే పరిస్థితి దాపురించింది.
ఉపాధి కోల్పోతున్న వృత్తిదారులు
వేళాపాలా లేని విద్యుత్‌ కోతలతో ఉపాధి కోల్పోతున్నామని కార్పెంటర్లు, వెల్డర్లు, మెకానిక్‌లు క్షౌర వత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ర పని చేయాలంటే విద్యుత్‌ అవసరమని, విద్యుత్‌ కోతలతో పనులు సక్రమంగా జరగడం లేదని వాపోతున్నారు. బార్బర్‌ షాపులపై కూడా విద్యుత్‌ కోతల ప్రభావం బాగా పడుతుందని నాయీబ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ కోతలతో పనుల్లేక కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని వాపోతున్నారు.
మరోవైపు విద్యుత్‌ కోతల ప్రభావం జిరాక్స్‌, పాన్‌ షాప్‌, ఫ్రూట్‌ జ్యూస్‌ వ్యాపారులపై తీవ్రంగా పడుతుంది. విద్యుత్‌ కోతలతో వెల్డింగ్‌ షాపులు కూడా మూత పడుతున్నాయి. విద్యుత్‌ లేకపోవడంతో ఫ్రిజ్‌ లు, జిరాక్స్‌ మిషన్లు, కంప్యూటర్లు పని చేయడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. దీంతో వ్యాపారం అవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో పనులను పూర్తి చేయలేకపోతున్నాం
విద్యుత్‌ కోతలతో సకాలంలో పనులను పూర్తి చేయలేకపోతున్నాం. సకాలంలో కస్టమర్లకు గేట్లు, కిటికీలు, ఇతర సామగ్రి డెలివరీ చేయలేకపోవడంతో కొత్తగా ఆర్డర్లు రావడం లేదు.విద్యుత్‌ కోతలు నివారిస్తేనే వెల్డింగ్‌ షాపులకు మనుగడ ఉంటుంది.
మర్రాపు పోలినాయుడు,
వెల్డింగ్‌ షాపు యజమాని, బొబ్బిలి


దోమలతో ఇబ్బందులు పడుతున్నాం
విద్యుత్‌ కోతలతో దోమలు బెడద అధికంగా ఉంది. దోమలు కాటు వేయడంతో అనారోగ్యం బారిన పడుతున్నాం. రాత్రి, పగలు తేడా లేకుండా విద్యుత్‌ కోతలు విధించడం సరికాదు. ఓ వైపు విద్యుత్తు బిల్లుల మోత మోగిస్తున్నారు. మరోవైపు కరెంటు ఇవ్వడం లేదు.
యు.ప్రసాద్‌, రంగరాయపురం
విద్యుత్‌ కోతలు నివారణకు చర్యలు
విద్యుత్‌ కోతలు నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. వాతావరణంలో మార్పులు రావడంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో కోతలు విధించాల్సి వస్తోంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్‌ కోతలు నివారణకు చర్యలు తీసుకుంటాం.
పూడి హరి, విద్యుత్‌ శాఖ ఇఇ
బొబ్బిలి