ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విద్యుత్తు అమర వీరుల స్ఫూర్తితో విద్యుత్‌ఛార్జీల భారాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దామని సిపిఎం నాయకులు ప్రతిన బూనారు. 2000 సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా సిపిఎం, వామ పక్షాలు చేసిన పోరాటంలో బషీర్ బాగ్ వద్ద చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం జరిపించిన కాల్పుల్లో అమరులైన రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం సోమవారం ఎల్‌బిజి భవనంలో జరిగింది. అమరుల చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ నాటి పారాట ఫలితంగా, కరెంట్ ఛార్జీలు నేటివరకు పెంచే సాహసం ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు. కానీ నేడు కేంద్రం అనుమతితో రాష్ట్రం ట్రూ అప్, సర్‌ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేస్తున్నారని అన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్య మిస్తామని తెఇపారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, జగన్మోహన్, సిఐటియు నాయకులు యుఎస్ రవికుమార్, బి.రమణ పాల్గొన్నారు.










