ప్రజాశక్తి-విజయనగరం : మిషన్ గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో క్రింద వాలంటీర్ ద్వారా గుర్తించిన విద్యార్థుల నమోదు శత శాతం జరగాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇప్పటి వరకు 97 శాతం పూర్తయిందని, మిగిలిన వారిని రెండు రోజుల్లోగా నమోదు పూర్తి చేయాలని సూచించారు. ఎంపిడిఒలు, తహశీల్దార్లు, ఎంఇఒలు, మండల ప్రత్యేకాధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం లో మంజూరు చేసిన పనులన్నీ వెంటనే ప్రారంభం కావాలని ఆదేశించారు. పూర్తయిన పనులకు బిల్లులను అప్లోడ్ చేయాలని తెలిపారు. ఉపాధి నిధులతో చేపడుతున్న భవన నిర్మాణాలు స్టేజ్ లు వేగంగా మారాలని ఆదేశించారు.
.పూర్తి చేసిన భవనాలను వెంటనే హాండ్ ఓవర్ చేయాలని అన్నారు. సెప్టెంబర్ 15 గడువు తేదీ గా నిర్ణయించడం జరిగిందని, ఈ లోగా వేగంగా స్టేజి అప్డేషన్ జరగాలన్నారు.వర్షాకాలం మొదలు అయినందున సంక్రమిత వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని , గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరచాలని సూచించారు. నీటినిల్వలు లేకుండా చూడాలని, డెంగీ, మలేరియా వ్యాధుల పై ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు. ఫీవర్ సర్వే ఖచితంగా జరగాలన్నారు. పి హెచ్ సి ల్లో అత్యవసర మందులన్నీ అందుబాటులో ఉంచాలన్నారు. డెంగీ, మలేరియా కేసు లు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు జరగాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










