Aug 25,2023 20:12

మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ :  కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి తగినన్ని నిధులు కేటాయించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్‌ వెంకటేష్‌, పి.రామ్మోహన్‌ డిమాండ్‌ చేశారు. సిఎం పర్యటనలో హంగులూ, ఆర్భాటాలు తప్ప విద్యారంగ అభివృద్ధి ఊసే లేకపోవడం విచారకరమని అన్నారు. మెంటాడ మండలంలో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర విద్యాశాఖా మంత్రి, రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన జిల్లా విద్యార్థులను నిరాశపరిచిందని పేర్కొన్నారు. ఈమేరకు శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. సిఎం తన పర్యటనను రాజకీయ ప్రచారానికి ఉపయోగించుకున్నారే తప్ప జిల్లా విద్యారంగ అభివృద్ధి కోసం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రస్తావన లేదని పేర్కొన్నారు. నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలను మూయించి, దూరాన ఉన్న హై స్కూళ్లకు పంపించి, ఎంతో మంది పేద,బడుగు,బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమైతే జగన్మోహన్‌ రెడ్డి తన ప్రసంగంలో గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని తెలిపారు. విభజన హామీలలో ఉన్న గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు రప్పించడంలో, నిర్మాణం చేపట్టడంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని పేర్కొన్నారు.
తక్షణమే భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడిన విజయనగరం జిల్లాలో ఎంతో కొంత చదువుకోవడానికి సహకరిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ హాస్టల్‌ భవనాలు కట్టించడంలో, మెస్‌ చార్జీలు,మౌలిక సదుపాయాలు కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మహారాజా కళాశాలను ప్రైవేటీకరణ చేసి విద్యార్థులను రోడ్డున పడేసిన జగన్మోహన్‌ రెడ్డి తన ప్రసంగంలో విద్యార్థులకు అండగా ఉంటున్నానని అనడం హాస్యాస్పదంగాఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలలో 50శాతం సీట్లను అమ్ముకునే విధానం తీసుకువచ్చి వైద్య చదువు చదివే విద్యార్థులను నిరాశకు గురిచేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి నిధులు కేటాయించి విద్యారంగం అభివృద్ధి చేయాలని కోరారు. లేని పక్షంలో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.