Sep 07,2023 21:15

బియ్యం పంపిణీ చేస్తున్న కాంతారావు

ప్రజాశక్తి-విజయనగరం : విద్యార్థుల్లో ఆహార లోపం తలెత్తకుండా పోషక విలువలు పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర ఆహార కమీషన్‌ సభ్యులు బి.కాంతారావు అన్నారు. బిసి కాలనీ అంగన్వాడీ కేంద్రం, గాజులరేగలో మండల పరిషత్‌ పాఠశాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం మెనూ అమలును, సరుకుల నిల్వ రికార్డుల నిర్వహణను తనిఖీ నిర్వహించారు. గాజులరేగ పాఠశాలలో వండిన వంటకాల స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ఆయన వెంట ఐసిడిఎస్‌ నోడల్‌ అధికారి విజయకుమారి, సిడిపిఒ ప్రసన్న, ఫుడ్‌ సేఫ్టీ అధికారి నాగుల మీరా, సివిల్‌ సప్లయి అధికారులు పాల్గొన్నారు.
బియ్యం పంపిణీ
రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యులు, కె.ఆర్‌.హెల్పింగ్‌ హ్యాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ బి.కాంతారావు ఆధ్వర్యంలో నగరంలోని న్యూ పూర్ణ జంక్షన్‌ వద్ద గురువారం పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. పేదలకు చేయూత అందించే క్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడిగా ఉన్న తనకు, ప్రజా సమస్యల మీద చేస్తున్నటువంటి పోరాటాన్ని గుర్తించి రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యులు పదవిని ముఖ్యమంత్రి అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు వస్తున్న జీతంలో కొంత భాగం పేద ప్రజల సేవకి ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే గత కొద్ది నెలలుగా కెఆర్‌ హెల్పింగ్‌ హాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైసిపి విద్యార్థి విభాగం రీజినల్‌ కోఆర్డినేటర్‌ రెల్ల జానకిరామ్‌, విశాఖ జిల్లా అధ్యక్షులు నమ్మి లక్ష్మణ్‌, సంస్థ వాలంటీర్లు పాల్గొన్నారు.