ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి, సాలూరు, దత్తిరాజేరు : గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యసేవల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛమైన మనసు, కల్మషం లేని మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది గిరిజనులేనని పేర్కొన్నారు. తరతరాలుగా వారిని పేదరికం వెంటాడుతోందని, ఇప్పటికీ కూడా మిగతా ప్రపంచంలో సమం కాని వారి జీవన ప్రమాణాలు, ప్రత్యేకించి వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పురోగతి సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల సరిహద్దు గ్రామాల పరిధిలో 561.88 ఎకరాల్లో తలపెట్టిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు చినమేడపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కేంద్ర విద్య, నైపుణ్యాభివద్ధిశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం మాట్లాడారు.

నేడు తలపెట్టిన గిరిజన వర్శిటీ సంకల్పంతో తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. విద్య, సాధికారత కోసం, ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి రావాలని, ఆ పోటీలో మన రాష్ట్ర విద్యార్థులు గెలవాలని ఆకాంక్షించారు. ఇందుకోసమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తున్నామన్నారు. నాడు - నేడు పథకంలో భాగంగా స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారాయన్నారు. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేస్తూ... ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫ్యానెల్స్ (ఐఎఫ్‌పి)లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరెక్కడా లేని విధంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఐటిడిఎ పరిధిలో మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్ నిర్మాస్తామని ఇచ్చిన మాట ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, పార్వతీపురంలో రూ. 250 కోట్లు ఖర్చు చేస్తూ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ప్రతి గిరిజన గ్రామంలో వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీల నుంచి సేకరించిన భూములకు, ఇతర పట్టా భూముల కంటే 10 శాతం ఎక్కువ పరిహారం ఇచ్చేందుకు ఇచ్చిన మాట ప్రకారం జీవో 109 జారీ చేశామని తెలిపారు. తొలుత సభలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి స్వాగత ప్రసంగం చేశారు. కేంద్రీయ విశ్వ విద్యాలయం ద్వారా ఇక్కడ యువతకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 561 ఎకరాల భూమిని యూనివర్శిటీ యాజమాన్యంకు అప్పగించామని గుర్తు చేశారు. 42 నెలల్లో గుర్తించిన ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు పూర్తవుతాయి అన్నారు. మొదటి దశలో భాగంగా రూ.420 కోట్లతో కొన్ని పనులు ప్రారంభయ్యాయని చెప్పారు. గిరిజన ప్రాంత ప్రజల కళలు, సంస్కతీ సంప్రదాయాలకు యూనివర్శిటీ చక్కని వేదికగా మారుతుందని పేర్కొన్నారు. విద్య, పరిశోధనలు మరింత పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గిరిజన సంక్షేమశాఖా మంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు దూరంగా నిర్మించాలని ప్రయత్నించిందని, కానీ సిఎం జగన్ ప్రధానితోనూ, కేంద్ర పెద్దలందరితోనూ మాట్లాడి గిరిజన యూనివర్శిటీ గిరిజన ప్రాంతంలోనే ఉండాలని ఒప్పించారని తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేయడం పొరుగు రాష్ట్రాలకు కూడా అనుకూలంగా ఉంటుందన్నారు. యూనివర్శిటీతో గిరిజనులకు మరింత మెరుగైన విద్య అందుతుందని అన్నారు. సిటియు వైస్ ఛాన్సలర్ కట్టమణి మాట్లాడుతూ గిరిజన ప్రాంత విద్యార్థులకు ఇదొక వరమన్నారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలను దుశ్శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, అరకు ఎంపి గొట్టేటి మాధవి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె. శ్యామలరావు, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, రఘురాజు, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, కడుబండి శ్రీనివాసరావు, బొత్స అప్పలనరసయ్య, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, పుష్ప శ్రీవాణి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ డాక్టర్ జివిజి శంకరరావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.










