ప్రజాశక్తి-గరివిడి : వెంకట రామ పౌల్ట్రీస్ యాజమాన్యం మొండివైఖరి అవలంభిస్తోందని సిఐటియు జిల్లా నాయకులు టివి రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పౌల్ట్రీ కార్మికులు విధులు బహిష్కరించి చీపురుపల్లిలో రావివలస రోడ్డు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహశీల్దార్ సురేష్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్లాం గ్రామంలోని వెంకటరమణ పౌల్ట్రీస్ యాజమాన్యం వేతన ఒప్పందం కాలపరిమితి గత మే నెలతో ముగిసిందని, కొత్తగా వేతన ఒప్పందం చేసుకుని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. నెలల తరబడి యాజమాన్యం తాత్సారం చేయడం సరికాదన్నారు. పురుష కార్మికులకు కనీస వేతనం రూ.15 వేలు, మహిళలకు రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు అంబల్ల గౌరినాయుడు, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఐ.గురునాయుడు, పి.ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.










