ప్రజాశక్తి-బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలో వైసిపిలో అసమ్మతి రాగం రోజురోజుకు పెరుగుతోంది. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో మున్సిపాలిటీతోపాటు గ్రామాల్లో వైసిపిపై అసమ్మతి పెరగడంతో రానున్న ఎన్నికల్లో టిడిపికి అనుకూలంగా ఉంటుందని అధికార పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది వైసిపి కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయనతో టచ్‌లో ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఆవిర్భావం నుంచి వైసిపిలో ఉంటున్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు సీనియర్ నాయకులు బహిరంగంగానే వాపోతున్నారు.
స్వపక్షంలో విపక్షం
బొబ్బిలి మున్సిపాలిటీలో కొంతమంది వైసిపి కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరంతా వైసిపిలో ఉంటూ తమ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. కౌన్సిల్ సమావేశంలో వైసిపి కౌన్సిలర్లు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారంటే వారిలో ఎంత అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష, స్వపక్ష కౌన్సిలర్లు ప్రజా సమస్యలపై నిలదీస్తే చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణకు అండగా వైస్ చైర్మన్ చెలికాని మురళి ఉండేవారు. వారందరికీ సమాధానం చెపుతూ శాంతింపజేసేవారు. ఇప్పుడు ఆయన కూడా అసమ్మతితో ఉన్నట్లు తెలిసింది. బొబ్బిలి రాజులు వైసిపిలో ఉన్నప్పుడు ప్రస్తుత అసమ్మతివాదుల్లో కొంతమంది ఇందులో, బొత్స సత్యనారాయణతోపాటు కలిసి కాంగ్రెస్‌లో మరికొంతమంది ఉండేవారు. మంత్రి బొత్స సత్యనారాయణ కాంగ్రెస్‌ను వీడి వైసిపిలో చేరడంతో ఆయన కేడరంతా అందులో చేరింది. బొత్స వైసిపిలో చేరడంతో రాజులు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. రాజులు టిడిపిలో చేరినా, వైసిపిలో వారి వెంట ఉన్న కొంతమంది అధికార పార్టీలో కొనసాగుతున్నారు. బొత్సతో వైసిపిలో చేరిన వారికి, రాజులతో టిడిపిలోకి వెళ్లకుండా అధికార పార్టీలో కొనసాగుతున్న వారికి బొబ్బిలి నియోజకవర్గంలో తగు ప్రాధాన్యత దొరకడం లేదని పలువురు వాపోతున్నారు. దీంతో వారంతా వైసిపి వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్లు, నాయకులు బేబినాయనతో టచ్‌లో ఉన్నట్లు చర్చ సాగుతోంది.
గ్రామాల్లో ఇదే పరిస్థితి
గ్రామాల్లో కూడా వైసిపిలో అసమ్మతి రాగం పెరుగుతున్నట్లు సమాచారం. సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు వైసిపిపై అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ సాగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అసమ్మతి పెరగడంతో వైసిపి కేడర్‌ను కలవర పెడుతుంది. అసమ్మతి వాదులంతా ఎన్నికల ముందు వైసిపిని వీడి టిడిపిలో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. కొన్ని రోజుల క్రితం కోట తలుపులు తెరిస్తే వైసిపి నేతలకు ఊపిరి ఆడకుండా చేరికలు ఉంటాయని బేబినాయన అనడంతో వారంతా ఆయనతో టచ్‌లో ఉన్నట్లు తెలిసింది. అసమ్మతి కొనసాగితే రానున్న ఎన్నికల్లో వైసిపి తీవ్ర నష్టం తప్పదని పలువురు రాజకీయ నేతలు అంటున్నారు.










