Sep 01,2023 21:01

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన బి.ఉమామహేశ్వరి, జెబి ధనుంజయనాయుడు, జె.పైడిరాజు

ప్రజాశక్తి-రేగిడి, తెర్లాం, గుర్ల :  విద్యారంగంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లాలోని ముగ్గురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. వారిలో రేగిడి ఆముదాలవలస జెడ్‌పి హైస్కూలులో స్కూలు అసిస్టెంట్‌(బయోలజి)గా పనిచేస్తున్న బి.ఉమామహేశ్వరి, గుర్ల మండలం పెద బంటుపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పా ఠశాలలో పనిచేస్తున్న జట్ల పైడిరాజు, తెర్లాం మండలం వెలగపూడి జెడ్‌పి హైస్కూలు గ్రేడ్‌ 2 ప్రధానోపాధ్యాయుడు జెబి ధనుంజయనాయుడు ఉన్నారు.
22 ఏళ్లుగా డిజిటల్‌ టెక్నాలజీ ఆన్‌లైన్‌ తరగతులు
గత 22 సంవత్సరాలుగా డిజిటల్‌ టెక్నాలజీని విస్తతంగా వినియోగిస్తూ 6 నుంచి 10వ తరగతి వరకు వర్చువల్‌, ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించడం వల్ల రేగిడి ఆముదాలవలస జెడ్‌పి హైస్కూలు స్కూలు అసిస్టెంట్‌ బి.ఉమామహేశ్వరి రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. ఎన్నో వైజ్ఞానిక ప్రదర్శనలు చేపట్టారు. ఈ వార్డు విద్యార్థులకే అంకితమని ఈ సందర్భంగా ఆమె ప్రజాశక్తికి తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో ఉపయుక్తమైన భోధనా భ్యాసన సామగ్రిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. గత రెండేళ్లగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగపడే 114 అంశాలను 'ఉమా సైన్స్‌ గురు' అనే యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా రూపొందించినట్లు తెలిపారు. విద్యార్థులు బైజూస్‌ కంటెంట్‌ టాబ్స్‌లో వీక్షించే విధంగా ప్రోత్సహించామన్నారు. విద్యార్థులు భవిష్యత్తు శాస్త్రవేత్తలు గా మారే విధంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో జరిగే వివిధ సైన్స్‌ కార్యక్రమాల పోటీలలో పాల్గొనే విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలకు గుర్తింపు
విద్యార్థుల్లో ప్రతిభా పాటవాలను పెంపొందించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా తనకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కినట్లు వెలగవలస జెడ్‌పి హైస్కూలు హెచ్‌ఎం జె బి ధనుంజయనాయుడు తెలిపారు. ఈయన పాచిపెంట మండలం కొత్తవలసలో 2012 నుంచి 17 వరకు, అలజంగిలో 2017 నుంచి 2023 వరకు పనిచేశారు. ప్రస్తుతం వెలగవలసలో విధులు నిర్వహిస్తున్నారు. ఏ పాఠశాలలో పనిచేసినా పాఠశాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు పేద విద్యార్థులకు తన వంతు సాయం అందిస్తున్నారు. పాచిపెంట మండలం కొత్తవలస యుపి స్కూల్లో పనిచేస్తున్నప్పుడు గ్రామ పెద్దలు సహకారంతో హై స్కూల్‌ గా మార్చడంలో కృషి చేశారు. ఎస్‌సి విద్యార్థులను ఆర్థికంగా చేయూతనిచ్చి ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్లడంలో ఆయన కృషి ఉంది. పూర్వ విద్యార్థి ఎడ్డి గోవింద విద్యార్థితో కంప్యూటర్‌ రూమ్‌ను పాఠశాలలో ఏర్పాటు చేయించారు. ఇలా అనేకమైన కార్యక్రమాలు చేపట్టినందుకు ఆయనకు అవార్డు లభించింది.
పాఠశాల అభివృద్ధిలో కీలకపాత్ర
గుర్ల మండలం పెదబంటుపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జిటిగా పనిచేస్తున్న జె.పైడిరాజు ఎక్కడ విధులు నిర్వహించినా అక్కడ పాఠశాల లభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. గతంలో మండ, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయు అవార్డులు అందుకున్నారు. 2009 నుంచి 2017 వరకు మండలంలో లవిడాం ఎంపిపి స్కూల్‌ లో విధులు నిర్వహించారు. ఆ గ్రామం నుండి ప్రైవేటు స్కూల్‌కు వెళ్తున్న 40 విద్యార్థులను దఫ దఫాలుగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. పాఠశాలను ప్రయివేటు స్కూల్‌ కు ధీటుగా రూపుదిద్దారు. విద్యార్థులకు కావాల్సిన నోట్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, ప్లాంకులు ఏటా అందిస్తున్నారు. గ్రామస్తుల సహకారం తో పాఠశాలకు వాటర్‌ ట్యాంక్‌, టాయిలెట్స్‌కు రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం కల్పించారు. గ్రామం లో డ్రాపౌట్స్‌ లేకుండా కృషి చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో సరస్వతి దేవి, గాంధీజీ విగ్రహాలను ఏర్పాటు చేశారు.