ప్రజాశక్తి-విలేకర్ల బృందం : విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఆరు సర్పంచ్ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రాగా, గజపతినగరం లోగిశ పంచాయతీ ఏకగ్రీవమైంది. శనివారం ఐదు స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. అందులో వైసిపి మద్దతుదారులు మూడు స్థానాల్లో గెలుపొందారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్లలో వైసిపి రెబల్ అభ్యర్థి విజయం సాధించగా, వంగర మండలం లక్షింపేటలో టిడిపి మద్దతుదారు గెలుపొందారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్ల, విజయనగరం మండలం పడాలపేట పోలింగు కేంద్రాలను ఎస్‌పి దీపిక సందర్శించారు. భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
పడాలపేట సర్పంచ్‌గా శ్రీదేవి
విజయనగరంటౌన్ విజయనగరం రూరల్ మండలం పడాలపేట పంచాయతీ సర్పంచ్‌గా వైసిపి మద్దతుదారు సువ్వాడ శ్రీదేవి విజయం సాధించారు. శ్రీదేవికి 736 ఓట్లు రాగా, టిడిపి మద్దతుదారు సుంకర రామలక్ష్మికి 284 ఓట్లు పోలయ్యాయి.
పెంటశ్రీరాంపురం సర్పంచ్‌గా గౌతమి
గంట్యాడ .. మండలంలోని పెంటశ్రీరాంపురం పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసిపి మద్దతుదారు కరక గౌతమి.. టిడిపి బలపరిచిన కరక రామయ్యమ్మపై 146 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండో వార్డు స్థానానికి జరిగిన ఎన్నికలో వైసిపి మద్దతుదారు గేదెల విజయ గెలుపొందారు.
వంగర టిడిపికి.. ఓనిఅగ్రహారం వైసిపికి..
వంగర.. మండలంలో లక్షింపేట, ఓని అగ్రహారం సర్పంచ్ స్థానాలకు, రుషింగిలో వార్డు మెంబర్‌కు జరిగిన ఉపఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. లక్షింపేటలో వైసిపి బలపరిచిన అభ్యర్థి వాన లక్ష్మీనారాయణపై టిడిపి మద్దతు అభ్యర్థి ఆవు సుజాత 67 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓని అగ్రహారంలో టిడిపి బలపరిచిన అభ్యర్థి మజ్జి గౌరీశ్వరిపై వైసిపి మద్దతు అభ్యర్థి కాబోతుల రుక్మిణమ్మ 301 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. రుషింగిలో వార్డు స్థానానికి జనసేన బలపరిచిన అభ్యర్థి యలకల శ్రీనివాసరావుపై వైసిపి మద్దతుదారు యలకల రాము 36 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. లక్షింపేటలో టిడిపి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
వృద్ధులకు ఇబ్బందులు
ఓటు వేసేందుకు ఓటర్లంతా శనివారం ఉదయం నుంచి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. అయితే వృద్ధులు, వికలాంగులకు వీల్‌చైర్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో వారంతా ఇబ్బందులు పడ్డారు. పోలీసులు వారికి సహకరించారు. బందోబస్తును డిఎస్‌పి ఎఎస్ చక్రవర్తి పర్యవేక్షించారు. కార్యక్రమంలో సిఐలు ఉపేంద్ర రావు, రవికుమార్, వంగర, రేగిడి ఎస్‌ఐలు జనార్దన్‌రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కొప్పెర్లలో వైసిపి రెబల్ అభ్యర్థి విజయం
పూసపాటిరేగ.. మండలంలోని కొప్పెర్ల సర్పంచ్‌గా వైసిపి రెబల్ అభ్యర్థి సంకాబత్తుల సత్తిబాబు 88 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. వైసిపి, టిడిపి ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి పైడి పార్వతమ్మ ఓటమిపాలయ్యారు. సత్తిబాబుకు ఎంపిడిఒ జి.రామారావు, ఎన్నికల ఆర్‌ఒ పాపునాయుడు ధ్రువపత్రం అందజేశారు. తనది ప్రజా విజయమని సర్పంచ్ సత్తిబాబు తెలిపారు. గ్రామంలో టిడిపి, వైసిపి, జనసేన కలిసి తనను ఓడించాలని ప్రయత్నించారని, ఓటర్లను బెదిరించారని, అందుకే ప్రజలు తిరగబడ్డారని చెప్పారు.
వార్డుల్లో...
బొబ్బిలిరూరల్.. మండలంలోని కొండదేవుపల్లిలో రెండో వార్డులో టిడిపి బలపర్చిన అభ్యర్థి పూతి సత్యనారాయణ.. వైసిపి మద్దతిచ్చిన రంభ లక్ష్మిపై 26 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల పరిశీలకులుగా ఎంపిడిఒ రవికుమార్, రూట్ ఆఫీసర్‌గా శ్రవణ్ కుమార్ వ్యవహరించారు. సిఐ నాగేశ్వరరావు ఆధ్వర్యాన బందోబస్తు ఏర్పాటుచేశారు.
డెంకాడ.. మండలంలోని డి.తాళ్లవలస గ్రామంలో ఏడో వార్డు ఉప ఎన్నికల్లో వైసిపి బలపరిచిన అప్పల సత్యవతికి 105 ఓట్లు, టిడిపి మద్దతు అభ్యర్థికి 17 ఓట్లు వచ్చాయి. 88 ఓట్ల తేడాతో సత్యవతి విజయం సాధించారు.
బొండపల్లి.. మండలంలోని దేవుపల్లిలో 13వ వార్డు సభ్యులుగా టిడిపి మద్దతిచ్చిన గాదం రాజేంద్ర కుమార్ విజయం సాదించారు. రాజేంద్రకు 106 ఓట్లు రాగా, మలిరెడ్డి శ్యామలరావుకు 86 ఓట్లు వచ్చాయి. సిఐ లెంక నారాయణరావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
జామి.. మండలంలోని లొట్లపల్లిలో పదో వార్డు ఉప ఎన్నికలో వైసిపి బలపరిచిన గంగమ్మ.. ప్రత్యర్థి చందక గౌరిపై 10 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి గంగరాజు ప్రకటించారు.
బాడంగి.. మండలంలోని పాల్తేరులో ఆరో వార్డు ఉప ఎన్నికలో వైసిపి మద్దతుదారు పూడి సత్యవతి.. ప్రత్యర్థిపై 76 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.










