Sep 02,2023 22:13

ముక్కలైన అప్పలరాజు శరీరం

ప్రజాశక్తి- డెంకాడ : రైల్వేలో మెకానిక్‌గా కొడుక్కి ఉద్యోగం రావడంతో ఆ తల్లి ఎంతో సంతోషించింది. కుటుంబానికి అండగా  నిలుస్తాడని భావించింది. తమిళనాడులో ఉద్యోగానికి వెళ్లి మూడు నెలలు అయింది. ఇంతలో రైలు ప్రమాదంలో ప్రమాదవశాత్తూ చనిపోయాడనే సమాచారంతో ఇంతలోనే ఆ తల్లి ఆశలు ఆవిరి అయిపోయాయి. ఈ విషాదకరమైన సంఘటన తెలియడంతో కుటుంబ సభ్యులతోపాటు భోగాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
భోగాపురం గ్రామానికి చెందిన ప్రగడ రవణ, దానమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఇందులో చిన్న కుమారుడు ప్రగడ అప్పలరాజు (29). ఎనిమిదేళ్ల కిందట తండ్రి రవణ చనిపోయినప్పటికీ తల్లి చదివించి ప్రయోజకుడిని చేయాలని అనుకుంది. అప్పలరాజు కూడా అదే విధంగా చదువులో బాగా రాణించేవాడు. మూడు నెలల కిందట రైల్వేలో మెకానిక్‌గా ఉద్యోగం సాధించాడు. దీంతో తల్లితోపాటు కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషించారు. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్‌ సమీపంలోని లోకో షెడ్‌లో మూడు నెలల కిందట వెళ్లి విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటివలె గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. రైలుభోగి కింద తోటి ఉద్యోగితో కలిసి మరమ్మతులు చేస్తున్నాడు. అయితే ఏమైందో తెలియదు కానీ రైలు కదలడంతో పట్టాల మధ్య ఇరుక్కుపోయాడు. రైలు పైనుంచి వెళ్లిపోవడంతో శరీరం రెండు ముక్కలైంది. అప్పలరాజు అక్కడకక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు భోగాపురంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన తల్లితోపాటు అక్క, అన్నయ్య కుటుంబ సభ్యులంతా విషాదంలో మునిగారు. మృతదేహాన్ని భోగాపురం తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు తమిళనాడు వెళ్లారు.