ప్రజాశక్తి - జామి : 'మాది జామి మండలం, రాంభధ్రపురం గ్రామం. నాపేరు తామాడ సంజీవి. గత వందేళ్లుగా మా కుటుంబం నివాసముంటున్న స్థలాన్ని మాకు తెలియకుండా గ్రామ పెద్దగా ఉన్న సర్పంచ్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని కాజేశారు. 'ఇది గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గ్రామ సర్పంచ్ పైనే చేసిన ఫిర్యాదు. గ్రామ ఆస్తులను, ప్రజల యోగక్షేమాలు చూడాల్సిన పెద్దలే ఇలాంటి పనులకు పాల్పడడం ఏంటని ఆవ్యక్తి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని రామభద్రపురం గ్రామంలోని సర్వే నెంబర్ 61లో తాతల తండ్రుల నుంచి సంజీవి కుటుంభం నివాసముంటుంది. అయితే ఇటీవల గ్రామ సర్పంచ్ పంచాయతీ అధికారులతో కలిసి, గ్రామ కంఠంగా ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇఒపిఆర్‌డిని విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఒక్క రామభద్రపురం గ్రామంలోనే కాదు మండలంలో అనేక గ్రామాల్లో గ్రామ పెద్దలుగా ఉన్న ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలు అనేకం. ఈ నేపథ్యంలోనే అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
స్పందనలో ఫిర్యాదు వచ్చింది
భూ రిజిస్ట్రేషన్ పై స్పందన ఫిర్యాదు రావడం వాస్తవమే. దీనిపై ఇంచార్జి ఇఒపిఆర్‌డి విచారణ చేస్తున్నారు. త్వరలోనే నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
ఎం.సతీష్, ఎంపిడిఒ, జామి










