Aug 27,2023 20:56

జెండా ఊపి బెల్లం సరఫరా వాహనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే శంబంగి

ప్రజాశక్తి-బాడంగి : తిరుమలలో వెంకటేశ్వరస్వామి ప్రసాదం తయారీ కోసం తిరుమల తిరుమతి దేవస్థానానికి జిల్లా రైతులు ప్రకృతి సేద్యం ద్వారా పండించిన చెరకుతో తయారుచేసిన బెల్లం సరఫరా ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని రైతు సాధికార సంస్థ, ఎపిసిఎన్‌ఎఫ్‌ (ఎపి కమ్యూనిటీ బేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌), మార్క్‌ ఫెడ్‌ సంస్థల ఆధ్వర్యంలో బాడంగి మండలం ముగడ, కోమటిపల్లి తదితర గ్రామాల రైతులు 2650 కిలోల బెల్లం తయారుచేసి, ఆదివారం ప్రత్యేక వాహనం ద్వారా సరఫరా చేశారు. ప్రత్యేకంగా ప్యాకింగ్‌ చేసిన బెల్లం పార్సిళ్లతో కూడిన వాహనాన్ని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు.. ముగడ గ్రామం వద్ద ఆదివారం జెండా చూపి ప్రారంభించారు. బొబ్బిలి ప్రాంతం నుంచి తిరుమల ఆలయానికి బెల్లం సరఫరా చేయడం గొప్ప విషయమని, తద్వారా ఈ ప్రాంతంలో రైతులు పండించిన పంటలకు మంచి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ వాహనం భద్రంగా చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎపిసిఎన్‌ఎఫ్‌ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఆనందరావు, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ విమల తెలిపారు.