ప్రజాశక్తి - కొత్తవలస : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో గురువారం సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. టిడిపి మండల అధ్యక్షులు గొరపల్లి రాము అధ్యక్షతన సంఘీభావ పాదయాత్ర దేశపాత్రునిపాలెం నుంచి మంగలపాలెం, రాజా ధియేటర్, రైల్వే స్టేషన్ మీదుగా కొత్తవలస అంబేద్కర్ జంక్షన్ వరకు సాగింది. రోడ్డుకి ఇరువైపులా వందలాది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులుతో భారీ స్థాయిలో డీజే, బాణాసంచాలతో సంఘీభావ పాదయాత్ర అంబేద్కర్ జంక్షన్ వరకు సాగింది. అనంతరం కొత్తవలస జంక్షన్‌లో అంబేద్కర్, ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గొప్ప కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజుల్లో 2,709 కిలోమీటర్లుకు చేరుకుందన్నారు. 15 జిల్లాలు, 77 నియోజకవర్గాల్లో ప్రజల బాధలను తెలుసుకున్నారని అన్నారు. రానున్న 2024 ఎన్నికలలో టిడిపి ప్రభుత్వం స్థాపించిన తరువాత హామీలను నెరవేర్చే విధంగా 100 కిలోమీటర్లకు ఒక్క హామీనిస్తూ శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమవలో నియోజకవర్గ నాయకులు గుమ్మడి భారతి, లగుడు రవికుమార్, పెదబాబు, నియోజకవర్గస్థాయి నాయకులు, వేపాడ టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు, మాజీ ఎంపిపిలు, జెడ్‌పిటిసిలు, ఐటిడిపి, టిఎన్‌ఎస్‌ఎఫ్, తెలుగు యువత, తెలుగు మహిళా అనుబంధ కమిటీ నాయకులు పాల్గొన్నారు.
డెంకాడ: వచ్చే ఎన్నికల తరువాత వైసిపి పార్టీ ఉండదని నెల్లిమర్ల నియోజవర్గం టిడిపి ఇంఛార్జి బంగార్రాజు అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయనకు సంఘీభావంగా కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో నియోజవర్గ స్థాయిలో భోగాపురం మండలంలో చెరుకుపల్లి నుంచి లింగాలవలస వరకూ సుమారు నాలుగు కిలోమీటర్లు సంఘీభావ పాదయాత్రను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ కు పాదయాత్రలో రోజు రోజుకి వస్తున్న ఆధరణను చూసి వైసిపి నాయకుల గుండెల్లో దడపట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ టిడిపి అధ్యక్షులు సత్యనారాయణ, శంకరరావు, పల్లె భాస్కరరావు, మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర రావు, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి పతివాడ సాగి వెంకట శివ సాగర్ నాయుడు, నాయకులు సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావు కార్యకర్తలు పాల్గొన్నారు.
బొబ్బిలి: నారా లోకేష్ యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసిన సంధర్భంగా బొబ్బిలిలో నియోజకవర్గం ఇంఛార్జి బేబినాయన ఆధ్వర్యంలో సంఘీభావ యాత్రను చేపట్టారు. బొబ్బిలి కోట నుంచి బయలుదేరిన ఈ పాదయాత్ర బలిజిపేట రోడ్డు మీదుగా వేణుగోపాలస్వామి గుడి ముందు నుంచి తాండ్రపాపారాయ బొమ్మ మీదుగా కోటకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మున్నాయుడు, టిడిపి నాయకులు పాల్గొన్నారు
విజయనగరం కోట : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా టిడిపి ఆధ్వర్యంలో గురువారం సంఘీభావ ర్యాలీ చేపట్టారు. నగరంలోని స్థానిక కోట జంక్షన్ వద్ద ఎన్‌టిఆర్ విగ్రహానికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతిరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘీ భావ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కోట నుండి పైడితల్లమ్మ ఆలయం, గంట స్తంభం జంక్షన్, కన్యకాపర మేశ్వరి కోవెల మీదుగా ఎస్‌బిఐ మెయిన్ బ్రాంచి వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, మండల అధ్యక్షులు బొద్ద నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.










