Aug 28,2023 21:26

ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులు, పలు గ్రామాల ప్రజలు

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  విశాఖ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాటిపూడి జలాశయం నుంచి తీసుకెళుతున్న నీటిని జివిఎంసి అమ్ముకుంటోందని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు అన్నారు. సోమవారం మండలంలోని కృష్ణాపురం సమీపాన తాటిపూడి నీటి శుద్ధి కేంద్రం వద్ద తాటిపూడి ఆయకట్టు రైతు సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధరాజు రాంబాబు మాట్లాడుతూ 50ఏళ్ల నుంచి తాటిపూడి జలాశయం నుంచి విశాఖ జివిఎంసి ప్రజల దాహార్తి తీర్చేందుకు పైపులైన్‌ ద్వారా తాటిపూడి నీటిని విశాఖకు తరలిస్తున్నారని అన్నారు. ఈ నీటిని ప్రజల దాహార్తి తీర్చేందుకే కాకుండా వాణిజ్యపరంగా పరిశ్రమలకు అమ్ముకుని జివిఎంసి ఏడాదికి రూ.26.20కోట్ల ఆదాయాన్ని సమకూర్చు కుంటుందని తెలిపారు. తాటిపూడి నుంచి శృంగవరపుకోట మండలం కొత్తూరు వరకు జివిఎంసి రోడ్డు వెంబడి పైపు లైన్‌ వేశారని, ఈరోడ్డు 20 ఏళ్లగా పాడై పోవటంతో పాఠశాలకువెళ్లే వారికి, వాహనదారుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. జివిఎంసి పరిధిలోనే ఈ రహదారి ఉన్నందున ప్రజల ఇబ్బందులను గమనించి వందల కోట్లు అర్జిస్తున్న దాంట్లో కనీసం లక్షల్లో ఖర్చు చేసైనా పాడైన రోడ్లను పునరుద్ధరణ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సుమారు 20 ఆటోల్లో రైతులు నాయకులు విశాఖ జివిఎంసికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రమణ, తాటిపూడి ఆయకట్టు రైతుల సంఘం కన్వీనర్‌ రాయవరపు సత్యనారాయణ, తాటిపూడి ఆయకట్టు రైతు సంఘం కో కన్వీనర్‌ లోకవరపు ఆదినారాయణ, తాటిపూడి ఆయకట్టు యూత్‌ అసోసియేషన్‌ వై.జోగి నాయుడు, తాటిపూడి ఆయకట్టు రైతుసంఘం నాయకులు సర్పంచ్‌ శ్రీరామ్మూర్తి, తాటిపూడి ఆయకటు సంఘం నాయకులు సూరి అప్పడు, వర్రీ సత్యారావు, సూరి దేవుడు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.