ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని పంచాయతీ వనరుల కేంద్రంలో బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు 'స్వమిత్వ' పై రెండు రోజుల జిల్లా స్థాయి శిక్షకులకు శిక్షణ(టిఒటి) కార్యక్రమం నిర్వహించారు. జెడ్‌పి సిఇఒ కె.రాజ్ కుమార్, డిపిఒ ఎల్‌ఎన్‌వి శ్రీధర్ రాజా జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. సిఇఒ రాజ్ కుమార్ మాట్లాడుతూ స్వమిత్వ పథకం అనేది కేంద్ర ప్రభుత్వ పతకమన్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఆస్తులకు సమగ్ర సర్వే చేపట్టడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని నివాస యోగ్యమైన స్థలాలను, ఇతర ప్రభుత్వ ఆస్తులను డ్రోన్ ద్వారా సర్వే చేపట్టి ప్రజలకు సమీకృత ప్రోపర్టీ సర్టిఫికెట్లను జారీ చేస్తారన్నారు. టిఒటి లుగా వచ్చిన పంచాయతీ కార్యదర్శులు, ఇఒఆర్‌డి లు ఈ కార్యక్రమంపై అవగాహన పెంపొందించుకొని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. డిపిఒ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పంచాయతీ ఆస్తులు, ప్రజల ఆస్తులను గుర్తిస్తామన్నారు.










