ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలోని ఒకటవ డివిజన్ పరిధి అయ్యప్పనగర్ సర్వే నెంబర్ 136లో గెడ్డను ఆక్రమించి అక్రమంగా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న స్వాతీ ప్యూర్ పెయిడ్ కూలింగ్ వాటర్ ప్లాంట్‌ను సీజ్ చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు తహశీల్దార్ కార్యాలయంలో బైఠాయించారు.ఈ సందర్భంగా సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ గత 10ఏళ్లుగా గెడ్డ ను అక్రమించి వాటర్ ప్లాంట్ నడుపుతున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోక పోవడం దుర్మార్గమని అన్నారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని, ఇప్పటి వరకు 14 సార్లు కలెక్టర్‌కు వినతులు ఇచ్చినా చర్యలు లేవన్నారు. బొగ్గుల దిబ్బలోమ రోడ్డు ఆక్రమణ చేశారనే నెపంతో 40 కుటుంబాలను కూల్చేసిన రెవెన్యూ , మున్సిపల్ యంత్రాంగానికి , స్వాతి ప్యూర్ పెయిడ్ కూలింగ్ వాటర్ ప్లాంట్ యాజమాన్యం చేసిన కబ్జా కనబడ లేదా అని ప్రశ్నించారు. తక్షణమే సర్వే నిర్వహించి కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవాలని, లేదంటే ఉద్యమం ఉధతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం నాయకులు పి.రమణమ్మ, ఎ.జగన్మోహన్, కె.సురేష్, బి.రమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు పట్టణ పౌర సంక్షేమ సంఘం వినతి
అయ్యప్పనగర్‌లో ప్రభుత్వ గెడ్డను అక్రమించి స్వాతీప్యూర్ పెయిడ్ కూలింగ్ వాటర్ ప్లాంట్‌ను నడుపుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు పట్టణ పౌర సంక్షేమ సంఘం, అపార్ట్ మెంట్స్ అండ్ కాలనీస్ అసోసియేషన్ నాయకులు యుఎస్ రవికుమార్, సిఐటియు జిల్లా ఫ్రధాన కార్యదర్శి కె.సురేష్ వినతినిచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకోవాలని, తద్వార అయ్యప్ప నగర్ ముంపునకు గురి కాకుండా చూడాలని కోరారు. కలెక్టరు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఒకు ఆదేశించారు.










