Aug 19,2023 19:51

పబ్లిక్‌టాక్‌

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : ఏ మాటల వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగి ఉందో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు' అని అన్నాడు లెనిన్‌ మహాశయుడు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ విన్యాసాలను పరిశీలిస్తున్న వారిలో చాలామంది అచ్చంగా లెనిన్‌ ఆలోచనా స్ఫూర్తిని గుర్తుచేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. చీపురుపల్లి నియోజకవర్గంలో ఇటీవల వైసిపి, టిడిపి మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే. అంతటితో ఆగకుండా వారి వాదన, ప్రతివాదనలను ప్రజల సమస్య మాదిరిగా చిత్రీకరిస్తూ సవాళ్లు, ప్రతి సవాళ్లకు దిగుతూ రోడ్లపైకి రావడం ఆసక్తికరంగా మారింది. ఉగాది తర్వాత టిడిపి, జనసేన ఉండబోవంటూ మంత్రి బొత్స సత్యనారాయణ శ్రీకాకుళంలో చేసిన వ్యాఖ్యలపై టిడిపి చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున స్పందించిన సంగతి తెలిసిందే. బొత్స వ్యాఖ్యలపై రాతపూర్వకంగా అగ్రిమెంటు ఇవ్వగలరా? అంటూ నాగార్జునతోపాటు చీపురుపల్లికి చెందిన టిడిపి నాయకులు డిమాండ్‌ చేశారు. చీపురుపల్లి ఆర్‌ఇసిఎస్‌ పరిధిలోని ఎనర్జీ అసిస్టెంట్‌ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని, నకిలీ సర్టిఫికెట్లతో కొంతమంది అనుయాయులకు ఉద్యోగాలు ఇప్పించారని కూడా విమర్శించారు. వీటన్నింటినీ తాము నిరూపిస్తామని, ఇరుపక్షాల ఆరోపణలు, వాదనలపై బాండ్‌ పేపర్ల మీద రాసుకుందామని కూడా సవాలు విసిరారు. తాము నిరూపించిన మరుక్షణం వైసిపి నాయకులు గుండు గీసుకుని రాజకీయ సన్యాసం చేస్తారా? అని సవాల్‌ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం చీపురుపల్లి ప్రజల ఇలవేల్పు కనక మహాలక్ష్మి ఆమ్మవారి ఆలయం వద్ద ఇరుపక్షాలకు చెందిన నేతలు చర్చకు సిద్ధమయ్యారు. దీంతో, పోలీసులు ఇరుపార్టీలకు చెందిన నాయకులనూ, ముఖ్యంగా టిడిపి నాయకులను గృహ నిర్బంధం చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా వైసిపి, టిడిపి ఆడుతున్న రాజకీయ డ్రామాలేనని చాలామంది వాదన. ప్రజల సమస్యలు వదిలేసి, ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం వల్ల ఉపయోగమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్‌ఇసిఎస్‌లో జరిగిన అక్రమాలపై బాండ్‌ పేపర్లపై సంతకాలకు డిమాండ్‌ చేసే బదులు, చిత్తశుద్ధి ఉంటే వెంటనే బయటపెట్టాలి కదా? అంటూ జనం చర్చించుకుంటున్నారు. వైసిపికి చెందిన బొత్స అనుయాయులు కూడా పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా స్పందించే బదులు, వైసిపి హయాంలో చేసిన ఘనకార్యమేమిటో చెప్పొచ్చు కదా? అని కూడా జనం చర్చించుకుంటున్నారు. వాస్తవానికి నియోజకవర్గంలో సీనియర్‌ నాయకులు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ఆశించినప్పటికీ ఆచరణలో కనిపించలేదని చాలా మంది వాపోతున్నారు. పైగా ఈ ప్రాంతంలో ఉన్న ఫెర్రో ఎల్లాయీస్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. విద్యుత్తు రాయితీలు ఇవ్వకపోతే నష్టమని పరిశ్రమల యజమాలు చేసిన మొర మంత్రి గారికి వినిపించలేదు. పైగా లాభాలు వచ్చినప్పుడు ఎవరికైనా ఇచ్చారా? అంటూ వారిని ఎగతాళి చేశారు. తొందర పడి పరిశ్రమలు మూసేయవద్దంటూ ఉచిత సలహాలు ఇచ్చారు. దీంతో, ఐదు యూనిట్లతో నడిచే గరివిడి ఫేకర్‌లో ఒక యూనిట్‌ పని నిలిపివేశారు. దీంతో పరిశ్రమలో పనిగంటలు తగ్గాయి. కార్మికులకు పూర్తిస్థాయిలో పనిలేదు. గరివిడి, మెరకముడిదాం, చీపురుపల్లి మండలాల్లోని ఫెర్రో పరిశ్రమలు మూతపడటంతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీనిపై ఎలాగూ మంత్రి దృష్టిపెట్టలేదు. కనీసం టిడిపి అయినా ప్రశ్నించి ఉంటే బాగుండేదనిది జనం మాట. ఆర్‌ఇసిఎస్‌లో అవినీతి భాగోతం బయటపెట్టడానికి బాండ్‌ పేపర్లు వెతుక్కునే బదులు, వెంటనే బయట పెట్టడంతోపాటు అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై మాట్లాడటం లేదు. ఇలా అనేక సమస్యలు నియోజకవర్గాన్ని వెంటాడుతున్నాయి. తోటపల్లి నీరు పూర్తిస్థాయిలో రావడం లేదు. వీటన్నింటిపైనా స్పందించని అధికార, ప్రతిపక్షాలు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు ఇటువంటి సవాళ్లతో హడావుడి చేస్తున్నాయని జనం చర్చించుకుంటున్నారు.