ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : బొబ్బిలిలోని ఎపిఐఐసి గ్రోత్ సెంటర్లో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన సత్య బయోఫ్యూయల్స్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి 30 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టడం జిల్లాలో చర్చనీయాశంగా మారింది. టిడిపి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున స్పందిస్తూ శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభుత్వ జిఒను రద్దుచేయాలంటూ ప్రకటనలో డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే వాస్తవిక ధరలకు భూములు కేటాయించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. అధికార యంత్రాంగం దాటవేత ధోరణి ఆధారంగా భూముల కేటాయింపులో మతలబు జరుగుతున్నట్టు ప్రజాశక్తి ముందే గుర్తించింది. జనం కూడా అనుమానించారు. ఈనేపథ్యంలో 'పరిశ్రమలు ఎక్కడీ భూములు ఎవరికి' అన్న పబ్లిక్‌టాక్ ప్రచురించిన సంగతి తెలిసిందే. సరిగ్గా 20 రోజుల వ్యవధిలో అడ్డగోలుగా భూములు కేటాయించినట్టు వెలుగులోకి వచ్చింది. బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లో ఎపిఐఐసి లెక్కల ప్రకారం ఎకరం ధర రూ.81.93 లక్షల వరకు ఉంది. ఇటువంటి భూమిని ఎకరా రూ.10 లక్షల చొప్పున బొత్స సోదరులు సతీష్ కుమార్, ఆదినారాయణ డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి ప్రభుత్వం కేటాయించిదని టిడిపి, సిపిఎం నాయకులు విమర్శించారు. బొబ్బిలి గ్రోత్ సెంటరుకు చుట్టుపక్కల బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి ధర రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఉంది. దీన్ని బట్టి సుమారు రూ.22 కోట్ల మేర బొత్స కుటుంబానికి అనుచిత లబ్ధిచేర్చారని జనం చర్చించుకుంటున్నారు. ఈ భూమిలో డిస్టిలరీ, ఇథైల్ ఎసిటేట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారట. మద్యం ఉత్పత్తిలోనూ, ఫార్మా తదితర పరిశ్రమల్లోనూ ఉపయోగించే ఇథనాల్ ఇక్కడ తయారు చేస్తారని సమాచారం. ఈ భూముల కేటాయింపునకు సంబంధించి ఆగమేఘాలపై ఫైలు నడించింది. వాస్తవానికి జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. ఈనేపథ్యంలో పరిశ్రమలు, పెట్టుబడులను ప్రోత్సహించడంలో తప్పులేదు. కానీ, అత్యంత కారుచౌకగా అదీ మంత్రి కుటుంబీకుల పేరున ఏర్పాటు చేయబోయే పరిశ్రమకు ధారాదత్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో, మంత్రి తన అధికారాన్ని అడ్డం పెట్టుకున్నారని కొందరు, ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు మంత్రులు, ఎమ్మెల్యేలకు ప్రజల ఆస్తులను వివిధ రూపాల్లో ధారాదత్తం చేస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందువల్లే ఇటీవల జరిగిన పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక సమావేశంలో పరిశ్రమలకు భూముల కేటాయింపు మినహా, వాటిని ఎవరు? ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఎంతెంత? భూమి కేటాయిస్తారనేది స్పష్టం చేయలేదు. ఈనేపథ్యంలో జనంలో సాగిన చర్చను ప్రజాశక్తి ప్రతిబింబించింది. నేడు అదే నిజమని తేలింది. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమందికి కేటాయించారో? అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.










