ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శ్రామిక మహిళల సమస్యలు ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదని, వాటి పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధం కావాలని శ్రామిక మహిళా రాష్ట్ర నాయకురాలు పి.మణి పిలుపునిచ్చారు. ఆదివారం కె.ఎల్.పురంలోని శ్రామిక భవనంలో శ్రామిక మహిళా జిల్లా నాయకులు వి.లక్ష్మి అధ్యక్షతన అన్ని సంఘాల శ్రామిక మహిళలతో జిల్లా సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మహిళలను హింసకు గురిచేసే విధానాలను అవలంబిస్తోందన్నారు. నేటికీ మహిళలు పనిచేస్తున్న చోట రక్షణ లేదన్నారు. లైంగిక వేధింపులు నిరోధక కమిటీలను ఎక్కడా ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా అందుబాటులో ఉండడం వల్ల ఆ ప్రభావం మహిళలపై పడుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో ఆర్థిక, సామాజికంగా ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం యుసిసిని అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది తప్ప పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయడానికి ఏమాత్రమూ చిత్తశుద్ధి చూపడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళా ఉద్యోగులు వివిధ స్థాయిల్లో వివక్షతకు గురవుతున్నారని ఆవేదన చెందారు. ఎన్నికలప్పుడే మహిళా ఉద్ధరణ, మహిళా సంక్షేమం.. అంటూ పాలకులు నినాదాలు ఇస్తున్నారు తప్ప ఆచరణలో మహిళా హక్కులను హరిస్తున్నారని మండిపడ్డారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, మెటర్నటీ లీవ్‌లు, సమాన పనికి సమాన వేతనాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో నాయకులు బి.సుధారాణి, ఎస్.అనసూయ, డి.రామలక్ష్మి, కృష్ణవేణి, బి.పైడిరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్ పాల్గొన్నారు.










