Aug 22,2023 21:28

ఇంటి డాక్యుమెంట్‌ను అందజేస్తున్న మేయర్‌ విజయలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ధ్యేయమని నగర మేయర్‌ విజయలక్ష్మి పునరుద్ఘాటించారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు డాక్యుమెంట్లను, ఇంటి తాళాలను అందజేశారు. వాస్తవానికి ఈమధ్య డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ సారిపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో భారీ సంఖ్యలో విచ్చేసిన లబ్ధిదారులకు డాక్యుమెంట్లను, ఇంటి తాళాలను అందజేశారు. అయితే అనివార్య కారణాలవల్ల కొంతమంది లబ్ధిదారులు సదరు సమావేశానికి హాజరు కాకపోవడంతో మంగళవారం మిగిలిన 90 మందికి నగరపాలక సంస్థ కార్యాలయంలో డాక్యుమెంట్లను, ఇంటి తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ లబ్ధిదారులకు గహాలు అందజేయడంలో గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సదుపాయాలు కల్పించకుండా లబ్ధిదారులను అయోమయంలో ముంచారని అన్నారు. డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి స్థానికంగా ప్రత్యేక శ్రద్ధ కనపరచి లబ్ధిదారులకు అనువుగా ఉండే విధంగా అన్ని సౌకర్యాలను మెరుగుపరిచారని చెప్పారు. శ్రావణమాసం నేపథ్యంలో లబ్ధిదారులు గహప్రవేశాలు చేసుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌వివి రాజేష్‌, సహాయ కమిషనర్‌ ప్రసాదరావు, హౌసింగ్‌ కమిటీ సభ్యులు తవిట్రాజు, మారోజు శ్రీనివాసరావు, కార్పొరేటర్లు అల్లు చాణిక్య, పట్టా ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.