Aug 25,2023 19:59

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌ :  గిరిజనులకు ఉన్నత విద్యను అందించేందుకు మన్యం జిల్లా పేరిట విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న గిరిజన యూనివర్శిటీకి చేయాల్సింది శంకుస్థాపనలు కాదని, నిధులు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రం ప్రకటించిన గిరిజన యూనివర్శిటీ పదేళ్లయినా ఇంకా శంకుస్థాపన దశలోనే ఉండడమంటే గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రంలోని బిజెపికి ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతోందని అన్నారు. విశ్వవిద్యాలయానికి నిధులు రప్పించడంలో, నిర్మాణం చేపట్టడంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని పేర్కొన్నారు. శుక్రవారం ఎల్‌బిజి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. వామ పక్షాలు, ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాలు ఫలితంగా గతంలో చంద్రబాబునాయుడు కొత్త వలస మండలం రెల్లివద్ద స్థలం కేటాయించి శంకుస్థాపన చేశారని, ప్రహరీ కూడా నిర్మించారని అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్శిటీ గిరిజన ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఉద్ధేశంతో తీవ్ర కాలయాపన చేసి నేడు శంకుస్థాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ పదేళ్లలో యూనివర్శిటీ నిర్మాణానికి నిధుల గురించి కేంద్రాన్ని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తక్షణం నిధులు మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.
30 నుంచి సమరభేరి
ప్రజా సమస్యలను పరిష్కరించాలని, భారాలను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమరభేరి నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వరరావు, లోకనాధం తెలిపారు. విద్యుత్‌ భారాలు ఉపసంహరించాలని కోరుతూ ఈనెల 28న విద్యుత్‌ అమర వీరుల సంస్మరణ సభలు నిర్వహిస్తామని తెలిపారు. వెనుక బడిన విజయనగరంజిల్లాలో ఇప్పటికే ఉన్న జ్యూట్‌ మిల్లులు మూత పడి వేలాది మంది రోడ్డున పడ్డారని అన్నారు. కొత్త పరిశ్రమలు రాక పోగా ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ధరలు వలన జిల్లాలో వున్న పెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు , ప్రజలు తీవ్ర భారాలు మోయాల్సి వస్తుందన్నారు. తక్షణమే విద్యుత్‌ ఛార్జీలు, ట్రు అప్‌ఛార్జీలు, సర్‌ ఛార్జీల పేరిట వేస్తున్న భారాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈనేపథ్యంలో తలపెట్టిన కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు , కె.లోకనాధం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పాల్గొన్నారు.