Sep 11,2023 21:45

సిఐటియు ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఆటో కార్మికులు

ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌ :  ఆటో డ్రైవర్లపై అక్రమ కేసులు ఆపాలని, ఈ చలాన, పెనాలిటీ పేరుతో వేధింపులు ఆపాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యాన సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈసందర్బంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, నాయకులు ఎ.జగన్మోహన్‌ మాట్లాడుతూ పోలీసులు ఆటో స్టాండ్లకు వెళ్లి 336 సెక్షన్‌ కింద డ్రైవర్ల పై బలవంతంగా అక్రమ కేసులు పెడుతున్నారని, అంగీకరించకపోతే బెదిరిస్తున్నారని, ఈ చర్యలను శ్రీ కనక దుర్గా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఆటో డ్రైవర్ల పై పెట్టిన అక్రమ కేసులు బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా, సరుకు రవాణా రంగంలో ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టులో ఆటోలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, డిగ్రీ పట్టా ఉన్నా ఉపాధి లేక స్వయం ఉపాధిగా ఆటోలను నడుపుకుంటున్నారని తెఇపారు. దీన్ని ఆదాయ వనరుగా భావించి మోయలేని ఫీజులు, పెనాల్టీలు వేస్తున్నారన్నారు. కరోనా అనంతరం రవాణా రంగం తీవ్రమైన సంక్షోభంలో పడిందన్నారు. బేరాలు లేక ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు అప్పులు చెల్లించలేక ఆటోలు వదులుకోవలసిన దుస్థితి ఏర్పడిందన్నారు. డ్రైవర్లను ఆదుకోవాల్సిన పాలకులు జలగల్లా పీల్చుకు తింటున్నారని అన్నారు. డ్రైవర్లతో పోలీసు వారు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, పార్కింగ్‌ స్థలాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఫీజులు, పెనాల్టీలు జీవో నెంబర్‌ 21 రద్దు చేయాలని, మోటారు వాహన చట్టం 2020ని రాష్ట్రంలో అమలు చేయొద్దని, పెట్రోల్‌, డీజిల్‌ ధర తగ్గించాలని కోరారు. ధర్నా లో వి.లక్ష్మణరావు, వి.ఆనంద్‌, బి.రమణ, కె.రాంబాబు, ఎం.హరి, బి.ఈశ్వరరావు, సిహెచ్‌ నాయుడు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.