ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని సంకిలి గ్రామంలో చాలీచాలని తాగునీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 1200 గడప ఉన్నప్పటికీ జనాభా ప్రాప్తికి 2,000 మంది ఉన్నారు. సరైన తాగునీటి పథకం లేక నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఒక వీధిలో తాగునీరు వదిలితే, మరో వీధి వారు వస్తే నీటి కోసం ఘర్షణలు తప్పడం లేదు. బొడ్డవలస వద్ద ఉన్న ఫైలేట్ ప్రాజెక్ట్ నుంచి తాగునీరు వస్తున్నప్పటికీ అనుకున్న విధంగా పబ్లిక్ కుళాయిలు ఏర్పాటు లేక తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజువారి ఉదయం పూట సరఫరా కావటం తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. సంకిలి గ్రామపంచాయతీ పరిధి నాగావళి నది నుంచి రాజాం, వంగర, సంతకవిటి, చీపురుపల్లి, జి సిగడాం ఇతర మండలాలకు తాగునీరు వెళ్తుంటే సంకిలి గ్రామానికి తాగునీటి సమస్య ఏర్పడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి తాగునీటి సమస్య ఉన్నప్పటికీ నాడు సమస్య మరింత జఠిలమైందని వాపోతున్నారు. ప్రతి ఇంటికి కులాయి అన్న పేరుతో జల జీవన్ పథకం ఈ గ్రామానికి ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం తాగునీటి సమస్య ఏర్పడిందని మహిళలు వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి
సంకిలి గ్రామానికి తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి దిగువ భాగాలకు తాగునీరు వెళ్లాలంటే రెండు ట్యాంకుల అవసరం. జల జీవన్ పథకం మంజూరు అయ్యింది. టెండర్లు పిలిచినప్పటికీ గుత్తేదారులు హాజరు కావడం లేదు. అందుకు లేటు అవుతుంది. తాగునీటి సమస్య పరిష్కరిస్తాం.
జి. శ్రీచరణ్, జెఇ ఆర్‌డబ్ల్యుఎస్, రేగిడి










