Sep 07,2023 21:40

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం కలెక్టరేట్‌ వద్ద వైద్యఆరోగ్యశాఖ ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎ.మాధవి, జిల్లా ప్రధాన కార్యదర్శి జివిఎస్‌ ఎన్‌ మూర్తి,
మన్యం జిల్లా నాయకులు డి.రమాదేవి తదితరులు మాట్లాడారు. ధర్నాకు ఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా పూర్వ అధ్యక్షులు బి. రాజగోపాల్‌ , బిహెచ్‌ ఆర్‌ ప్రభూజీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రోజురోజుకూ పని భారాన్ని పెంచి ఉద్యోగులను ఆందోళన గురి చేస్తుందని అన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించాల్సిన మెడికల్‌ ఉద్యోగులు యాప్‌ల పేరుతో ఇంటర్నెట్‌ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఆన్‌లైన్‌ ఉద్యోగం చేయాలంటే కనీసం ట్రైనింగ్‌ కూడా ఇవ్వకుండా ఉద్యోగులపై ఈ భారాన్ని మోపడం సరికాదన్నారు. సచివాలయం గ్రేడ్‌ హెల్త్‌ సెక్రటరీలకు ఇంక్రిమెంట్‌ ఇంకా కలపకపోవడం అన్యాయం అన్నారు. కొన్నిచోట్ల ఎస్‌ఆర్‌ కూడా ఓపెన్‌ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు, డిఎంహెచ్‌ఒకు వినతి అందజేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమక్షంలో జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి పరిష్కారానికి చొరవ చూపాలని యూనియన్‌ నాయకులు జివిఎస్‌ఎన్‌మూర్తి, మాధవి కోరారు. ధర్నాలో యూనియన్‌ జిల్లా సహా అధ్యక్షులు సి హెచ్‌ రమాదేవి, కోశాధికారి ధనుంజరు పట్నాయక్‌, పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు డి రమాదేవి, సీనియర్‌ ఎఎన్‌ఎం దుర్గా, రమాదేవి, కళావతి, పూర్ణ, సూర్యకుమారి, అమృతలక్ష్మి తదితరులు నాయకత్వం వహించారు.