ప్రజాశక్తి-వేపాడ : శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కోరుతూ మృతదేహంతో జాకేరు గ్రామంలో ముస్లిములు ఆందోళన చేపట్టారు. సర్పంచ్ దంపతులు స్పందించి చర్యలు తీసుకోవడంతో ఆందోళన విరమించి, అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
మండలంలోని జాకేరు గ్రామంలో ముస్లిములకు ప్రత్యేకంగా శ్మశానవాటిక కోసం స్థలం కేటాయించాలని గత కొన్నేళ్లుగా కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం జాకేరులో ముస్లిం మహిళ మృతిచెందారు. శ్మశానానికి స్థలం కేటాయించేవరకూ మృతదేహాన్ని ఖననం చేసేది లేదంటూ ఆమె కుటుంబీకులు శవం వద్ద బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ బుద్ధ చిన్నమ్మలు, అప్పలనాయుడు దంపతులు.. వారితో సంప్రదింపులు జరిపారు. శ్మశానవాటిక కోసం కనీసం ఐదు సెంట్లు స్థలం కావాలని, స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాలని వారు కోరారు. సర్పంచ్ దంపతులు రెవెన్యూ అధికారులతో మాట్లాడి, పొలమరశెట్టి జగ్గారావు కళ్లం సమీపంలో ఉన్న ఐదు సెంట్ల భూమిని గుర్తించి, ముస్లిముల శ్మశాన వాటిక కోసం కేటాయించారు. మండల పరిషత్తు నుంచి ఎంపిపి నిధులను అడిగి గాని, పంచాయతీ నిధులతో గాని ప్రహరీ నిర్మిస్తామని సర్పంచ్ హామీనిచ్చారు. దీంతో ముస్లిములు ఆందోళన విరమించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు.










