ప్రజాశక్తి-విజయనగరం : జగనన్నకు చెబుదాంలో మున్సిపాలిటీల పరిధిలో వచ్చిన వినతులను ఆయా ప్రత్యేకాధికారులు అన్ని శాఖలతో సమావేశమై సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. జగనన్నకు చెబుదాంలో వచ్చిన వినతులను పరిష్కరించిన విధానంపై గత వారంలో ఆయా అర్జీదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమైన వినతులపై కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్.. జిల్లా అధికారులతో సోమవారం సమీక్షించారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసు వంటి పలు శాఖలు ఉమ్మడిగా పరిష్కరించాల్సిన సమస్యలపై ఆయా శాఖల అధికారులు, ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో కలిసి చర్చించాలన్నారు. వాటిని ఎలా పరిష్కరించాలో నిర్ణయించాలని సూచించారు. సమావేశంలో డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు ఎం.లావణ్య, సులోచన రాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
'జగనన్నకు చెబుదాం'కు 214 వినతులు
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి 214 వినతులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు 145, ఆసుపత్రి సేవలకు 4, ఇపిడిసిఎల్‌కు 2, వైద్య ఆరోగ్య శాఖకు 5, పంచాయతీ శాఖకు 10, హౌసింగ్‌కు 8, మున్సిపల్ 4, డిఆర్‌డిఎ 11, గ్రామ, వార్డు సచివాలయ శాఖకు 25 వినతులు అందాయి. కలెక్టర్ నాగలక్ష్మి, జెసి మయూర్ అశోక్, డిఆర్‌ఒ గణపతిరావు, డిప్యూటీ కలెక్టర్లు ఎం.లావణ్య, సులోచన రాణి వినతులు స్వీకరించారు. ఆయా వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
రోగాల బారిన పడకుండా కాపాడాలి
విజయనగరంకోట : నగర ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడాలని టిడిపి నాయకులు స్పందనలో కలెక్టర్‌కు వినతి అందించారు. నగరంలో దోమలు విపరీతంగా పెరిగాయని, వాటిని అరికట్టడానికి నగర పాలకులు ఎటువంటి చర్యలూ చేపట్టలేదని వివరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కనక మురళీమోహన్, బంగారు బాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.










