Aug 24,2023 20:18

ఏర్పాట్లు పరిశీలించిన ఉన్నతవిద్యా శాఖ కార్యదర్శి శ్యామలరావు

ప్రజాశక్తి-విజయనగరం :  కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన చేసే నిమిత్తం శుక్రవారం జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. షెడ్యూలులో ఎలాంటి మార్పులు లేనప్పటికీ ముందుగా ప్రకటించిన విధంగా కాకుండా మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్దకు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మరడాం సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలసి చేరుకుంటారు. బహిరంగసభలో పాల్గొన్న అనంతరం మరడాం హెలిపాడ్‌కు చేరుకుని విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు. జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్‌ శ్రీమతి ఎస్‌.నాగలక్ష్మి, ఎస్‌.పి. దీపిక పాటిల్‌, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, ఆర్‌డిఒ శేషశైలజ చినమేడపల్లి వద్దకు గురువారం ఉదయాన్నే చేరుకొని హెలిపాడ్‌ నిర్మాణం, శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఉన్నతవిద్యా శాఖ కార్యదర్శి
రాష్ట్ర ఉన్నతవిద్యా శాఖ కార్యదర్శి జె.శ్యామల రావు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్థాపన ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. చినమేడపల్లిలో హెలిప్యాడ్‌, శంకుస్థాపన కార్యక్రమం, మరడాం లో బహిరంగ సభావేదిక వద్ద చేసిన ఏర్పాట్లను కలెక్టర్‌ నాగలక్ష్మి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి వివరించారు. జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, ఆర్‌డిఒ బి. శేషశైలజ, జిల్లా అధికారులు పర్యటనలో పాల్గొన్నారు