
ప్రజాశక్తి-దత్తిరాజేరు : జిల్లాలోని దత్తిరాజేరు, మెంటాడ మండలాల పరిధిలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, పి.రాజన్నదొర, వైసిపి ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వైవి సుబ్బారెడ్డి, జెడ్‌పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ నాగలక్ష్మి, జెసి అశోక్ పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు గత నాలుగు రోజులుగా తీవ్ర కృషి చేస్తున్నారు. మెంటాడ మండలం చిన మేడపల్లి రెవెన్యూ పరిధిలో శంకుస్థాపన కోసం శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. శంకుస్థాపన అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం గ్రామం జాతీయ రహదారి ప్రక్కన సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. సిఎం సభను జయప్రదం చేసేందుకు అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని వైవి సుబ్బారెడ్డి అన్నారు. వారి వెంట గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఉన్నారు.
నాలుగు కిలోమీటర్ల కే రెండు హెలీప్యాడ్లు
ముఖ్యమంత్రి సభా ప్రాంగణం వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లి చినమేడపల్లి వద్ద శంకుస్థాపన చేసేందుకు వీలుగా తొలుత అధికారులు చర్యలు చేపట్టారు. సభా స్థలం మరడాం నుండి నాలుగు కిలోమీటర్లు చకచకా తారు రోడ్డు కూడా వేశారు. బుధవారం రాత్రి ముఖ్యమంత్రి సెక్యూరిటీ నిఘా వర్గం ఆదేశాల మేరకు రోడ్డు మార్గం బాగోలేదని ఆదేశించడంతో గురువారం శంకుస్థాపన స్థలం వద్ద అప్పటికప్పుడు 10 ఎకరాల స్థలంలో చెట్లను తొలగించి చదును చేసి మరో హెలిప్యాడ్ తయారు చేశారు. విశాఖపట్నం నుండి నేరుగా శంకుస్థాపన స్థలం వద్దకు హెలికాప్టర్లో చేరుకొని శంకుస్థాపన అనంతరం తిరిగి హెలికాప్టర్లో మరడాం వద్ద హెలిప్యాడ్ వద్ద కు చేరుకుంటారు.
సభా ప్రాంగణం అంతా పోలీసులే
ముఖ్యమంత్రి సభా ప్రాంగణం వద్ద కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణం వద్ద ఎటు చూసినా పోలీసులు మోహరించారు.










