ప్రజాశక్తి-విజయనగరం : ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, నిర్ణీత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 15న జిల్లాకు వస్తున్న నేపథ్యంలో వైద్య కళాశాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం ఆమె పరిశీలించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు, మెయిన్ గేట్ ఆర్చ్, రహదారి పనులను ఆమె జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించి తగిన సూచనలు చేశారు. మరింత వేగంగా పనులు చేయాలని సూచించారు. ఆమె వెంట జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఆర్డీవో సూర్యకళ, ఎపి ఎంఎస్‌ఐడిసి ఎస్‌ఇ అంకమ్మ చౌదరి, ప్రత్యేక ఉప కలెక్టర్ల సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు ఇతర అధికారులు ఉన్నారు.
సమన్వయంతో విజయవంతం చేయాలి
ముఖ్యమంత్రి పర్యటనను అధికారులంతా సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. ఇక్కడి వైద్య కళాశాల ప్రాంగణం నుంచే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో నిర్మించిన మరో నాలుగు వైద్య కళాశాలల్ని ఆన్‌లైన్ ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై ఎస్‌పి ఎం.దీపిక, జాయింట్ కలెక్టర్‌లతో కలసి అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు వెల్లడించారు. హలిపాడ్ వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిఆర్‌ఒ, డిసిహెచ్‌ఎస్‌లను ఆదేశించారు. సమావేశంలో ఎస్‌పి ఎం.దీపిక, జెసి మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
- ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట మధ్య మెడికల్ కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
- తొలుత జెఎన్‌టియు. సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్‌లో చేరుకొని అక్కడి నుంచి నేరుగా వైద్య కళాశాలకు చేరుకుంటారు. - వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం వైద్య కళాశాలకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరిస్తారు. అనంతరం వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకిస్తారు.
- స్కిల్ ల్యాబ్‌ను, బయో కెమిస్ట్రీ, అనాటమీ లేబ్‌లను సందర్శిస్తారు.
- అనంతరం లెక్చర్ హాలు నుంచి రాష్ట్రంలోని ఐదు వైద్య కళాశాలలను ఆన్‌లైన్‌లో ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని ఐదు వైద్య కళాశాలల విద్యార్ధులతో ముఖాముఖిలో పాల్గొంటారు.
- అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకొని విజయవాడ వెళ్లనున్నారు.










