Aug 22,2023 21:14

ఏర్పాట్లపై అధికారులతో చర్చిస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర, సిఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం

ప్రజాశక్తి-మెంటాడ, దత్తిరాజేరు  :  మెంటాడ మండలం చినమేడపల్లి వద్ద కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసే నిమిత్తం ఈనెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. శంకుస్థాపన కార్యక్రమానికి అనువుగా మొక్కలను, పొదలను తొలగించి నేలను చదునుచేసే కార్యక్రమాన్ని రోడ్లు భవనాల శాఖ చేపడుతోంది. మరోవైపు జాతీయ రహదారి నుంచి కుంటినవలస మీదుగా చినమేడపల్లి వరకు 4 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, పటిష్టపరచడం వంటి పనులను పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ నాలుగు కిలోమీటర్ల మార్గంలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ప్రయాణించడంతో వారిని ప్రజలు చూసేందుకు వీలుగా పలుచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి రోడ్లు భవనాల శాఖ ఇఇ వెంకటరమణను ఆదేశించారు. ముఖ్యమంత్రి హెలిపాడ్‌ నుంచి కుంటినవలస వరకు రోడ్డు మార్గంలో చేరుకోనున్నందున ఈ మార్గంలో చేయాల్సిన భద్రత ఏర్పాట్లపై కలెక్టర్‌, ఎస్‌పి, జెసి కలిసి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి ప్రజలను తరలించేందుకు 200 ఆర్టీసీ బస్సులతో పాటు మరో 150 ప్రైవేటు వాహనాలను సమకూరుస్తున్నారు.
సిఎం పర్యటనను విజయవంతం చేయండి
ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర కోరారు. సిఎం కార్యక్రమాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లాపరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావుతో కలసి సిఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మరడాంలో సభావేదిక వద్ద సమీక్షించారు. ఎమ్మెల్యేలు బొత్స అప్పల నరసయ్య, ఎస్‌.వి.చినప్పల నాయుడులతో కలసి సిఎం సభావేదిక ఏర్పాట్లను, హెలిపాడ్‌, శంకుస్థాపన శిలాఫలకం వద్ద ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
గిరిజన వర్శిటీకి మౌళిక వసతులు : నాగలక్ష్మి
జిల్లాలో ఏర్పాటవుతున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి అవసరమైన విద్యుత్‌, నీటిసరఫరా, రోడ్లు వంటి మౌళిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని కలెక్టర్‌ నాగలక్ష్మి చెప్పారు. ఇప్పటికే విశ్వ విద్యాలయం ఏర్పాటుకోసం 560ఎకరాలను సేకరించి అందజేశామన్నారు. మరడాంలో సభావేదిక వద్ద కలెక్టర్‌ మీడియాతో మాట్లాడుతూ యూనివర్శిటీ ఏర్పాటుకోసం 60 నుంచి 70 ఎకరాలు జిరాయితీ భూమిని సేకరించామన్నారు. మరో రూ.1.37 కోట్లు మాత్రమే పరిహారం చెల్లించాల్సి వుందని వారికి కూడా త్వరలో చెల్లిస్తామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా ఈ ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని గిరిజన విద్యార్ధులకు ఉన్నత విద్యావకాశాలు పెరుగుతాయన్నారు.